మహారాణిపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. ఇప్పటికే అధికారులతో సన్నద్ధతపై సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి గురువారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్లు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


