ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు
నలుగురికి బదిలీ..
ఒకరికి అదే సెక్షన్‌లో పోస్టింగ్
మహిళా సూపరింటెండెంట్‌ను బదిలీ చేసి
మరీ అదే స్థానంలో నియామకం
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదోన్నతుల వ్యవహారం సరికొత్త చర్చకు దారితీస్తోంది. నిబంధనలకు పాతరేసి తమకు అనుకూలమైన వ్యక్తిపై చూపిస్తున్న అతిప్రేమ ఏయూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తాజాగా జరిగిన ఐదుగురు ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
రూల్స్ పక్కనపెట్టి.. : ఏయూలో ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో నలుగురికి పదోన్నతిపై ఇతర సెక్షన్లకు బదిలీ చేశారు. అయితే ఏయూ ప్రధాన పరిపాలన కార్యాలయంలోని రికార్డు సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి అదే సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా నియమించడం దుమారం రేపుతోంది. సాధారణంగా పదోన్నతి పొందిన ఉద్యోగికి మరో విభాగం లేదా సెక్షన్‌కు బదిలీ చేయాల్సి ఉండగా.. ఈ ఉద్యోగికి మాత్రం మినహాయింపు ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. ఈయనకు ఆ పోస్టు కట్టబెట్టేందుకు.. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
‘కోటరీ’ అండ? : ఈ వ్యవహారం వెనుక ఏయూ వైస్‌ఛాన్సలర్, రిజిస్ట్రార్ పేషీల్లో ఏళ్ల తరబడి తిష్టవేసిన ఓ కోటరీ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నలుగురు వ్యక్తులు కలిసి సిండికేట్‌గా ఏర్పడి కీలక నిర్ణయాలు, బదిలీల్లో చక్రం తిప్పుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. తమకు సహకరించిన ఉద్యోగికి మేలు చేసేందుకే నిబంధనలకు విరుద్ధంగా ఈ పోస్టింగ్ ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


