సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఆషాఢ శుద్ధ చతుర్దశి సందర్భంగా మంగళవారం నిర్వహించే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సింహగిరిని ఒకసారి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందనే విశ్వాసంతో రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో దేవస్థానం, రెవెన్యూ, జీవీఎంసీ, పోలీస్, వైద్యారోగ్య, ఆర్టీసీ, విద్యుత్, అగ్నిమాపక తదితర శాఖలు సమన్వయంతో విస్తత ఏర్పాట్లు చేశాయి.
అడుగడుగునా సేవలు
గిరి ప్రదక్షిణ మార్గంలోని 28 ప్రాంతాల్లో సేవా కేంద్రాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 22 అంబులెన్స్‌లు, 600 తాత్కాలిక మరుగుదొడ్లు, విస్తృత పారిశుధ్య ఏర్పాట్లు, 53 పార్కింగ్ కేంద్రాలు, 50 ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు అందుబాటులో ఉంటాయి. అప్పుఘర్, జోడుగుళ్లపాలెం వద్ద సముద్ర స్నానం చేసే భక్తుల కోసం మూడు షిఫ్టుల్లో 90 మంది గజఈతగాళ్లను నియమించారు.
కట్టుదిట్టమైన భద్రత
నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సింహాచలం పుష్కరిణి సత్రం వద్ద ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు ఏడు ఉప కంట్రోల్ రూమ్‌లు పనిచేయనున్నాయి.
దర్శనాలు ఇలా..
గిరి ప్రదక్షిణ పూర్తి చేసి సింహాచలం చేరుకునే భక్తులకు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు దర్శనాలు కల్పిస్తారు. బుధవారం ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు, తిరిగి రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆలయ ప్రదక్షిణలకు అనుమతి ఉంటుంది.
మెట్లమార్గంలో ఆంక్షలు
బుధవారం కొండపైకి వెళ్లే భక్తులను మాత్రమే మెట్లమార్గంలో అనుమతిస్తారు. దిగివచ్చే భక్తులను దేవస్థానం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తారు.
అన్నప్రసాదం.. లడ్డూ విక్రయం
బుధవారం అన్నప్రసాద భవనంలో భక్తులందరికీ కదంబం, దద్దోజనం నిర్విరామంగా అందజేస్తారు. లడ్డూల విక్రయానికి సుమారు లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. రూ.100 ప్రత్యేక దర్శనం టికెట్‌ను ఈసారి రద్దు చేసి, ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం మాత్రమే అందుబాటులో ఉంచారు.
హెల్ప్‌లైన్‌లు
పుష్పరథంతో ప్రారంభం
గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడుతూ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం తొలిపావంచా వద్ద నుంచి పుష్పరథం బయలుదేరుతుంది. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి రథాన్ని ప్రారంభిస్తారు. రథంతో కలిసి ప్రదక్షిణ ప్రారంభించాలనుకునే భక్తులు ముందుగానే తొలిపావంచా వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
అల్లిపురం: సింహాచల గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలోకి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించడంతో పాటు భక్తుల వ్యక్తిగత వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నా రు. మంగళవారం ఉదయం 6 నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు హనుమంతవాక–అడవివరం మార్గంలో సాధారణ వాహనాల రాక పోకలను నిలిపివేస్తారు. అలాగే వేపగుంట జంక్షన్ నుంచి ఓల్డ్ గోశాల వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మినహా ఇతర వాహనాలకు అనుమతి ఉండదని వెల్లడించారు. భక్తులు తమ వ్యక్తిగత వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి, అక్కడి నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు లేదా కాలినడకన గిరి ప్రదక్షిణ ప్రారంభ స్థలానికి చేరుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వ్యక్తిగత వాహనాలతో ప్రయాణించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గిరిప్రదక్షిణ ఇలా..
తొలి పావంచా నుంచి మొదలయ్యే గిరి ప్రదక్షిణ.. అడవివరం జంక్షన్, పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైల్, ముడసర్లోవ, చినగదిలి, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, హనుమంతవాక జంక్షన్, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డు, వెంకోజీపాలెం, ఇసుకతోట, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు విగ్రహం, బాలయ్యశాస్త్రి లేఅవుట్, పోర్టు స్టేడియం, డీఎల్‌బీ క్వార్టర్స్, మాధవధార, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, ఎన్‌ఎస్‌టీఎల్, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్ మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది.
సింహ‘గిరి ప్రదక్షిణ’కు సర్వం సిద్ధం నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం


