డాబాగార్డెన్స్: సింహాచల గిరి ప్రదక్షిణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లతో పాటు నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 32 కి.మీ గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతి 50 మీటర్లకు రెండు డస్ట్‌బిన్లు, ప్రతి 500 మీటర్లకు ఒక కాంపాక్టర్ బిన్ ఏర్పాటు చేసి పారిశుధ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. 114 తాగునీటి కేంద్రాల ద్వారా 16,390 ఇరవై లీటర్ల నీటి క్యాన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టాయ్‌లెట్ల నిర్వహణకు 38 నీటి ట్యాంకర్లు, మొత్తం 727 మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రదక్షిణ మార్గంలో 3,163 శాశ్వత వీధి దీపాలతో పాటు 1,364 తాత్కాలిక హైపవర్ లైట్లు, 16 ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లుంబినీ పార్క్ వద్ద సముద్ర స్నానం చేసే భక్తుల కోసం షవర్ బాత్‌లు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, లైఫ్‌గార్డులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 28 వైద్య శిబిరాలతోపాటు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 7 కంట్రోల్ రూమ్‌లతోపాటు సింహాచలం పుష్కరిణి వద్ద కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీసీ కెమెరా నిఘా, పబ్లిక్ అడ్రస్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్నప్రసాద, పానీయాల పంపిణీ కేంద్రాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ సారథి
నగరంలో ట్రాఫిక్ నిర్వహణను ఆధునికీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ప్రాజెక్ట్ సారథి కింద అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలిసి ప్రాజెక్టు పురోగతిని సమీక్షించినట్లు చెప్పారు.
’స్టెపప్’ కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల్లో జీవిత నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, ప్రభుత్వ సేవలపై అవగాహన పెంపొందించేందుకు ’స్టెపప్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థినులను బ్యాంకులు, రిజిస్ట్రేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్లి ప్రభుత్వ సేవలు, ఆస్తుల నమోదు, వీలునామాలు, ఒప్పందాల నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
సైక్లింగ్ ట్రాక్‌లు, పార్కుల అభివృద్ధి
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సాగర్‌నగర్‌లో గుడ్డవానిపాలెం నుంచి రాడిసన్ బ్లూ హోటల్ వరకు 2 కిలోమీటర్ల ట్రాక్, పాత స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పరిసరాల్లో 5.2 కిలోమీటర్ల ట్రాక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
హరిత విశాఖ– 50 పార్కుల మిషన్
హరిత విశాఖ లక్ష్యంగా రూ.21.97 కోట్లతో జీవీఎంసీ పరిధిలో 50 ఆధునిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.120 కోట్లతో 399 అభివృద్ధి పనులు మంజూరయ్యాయని తెలిపారు. వెలంపేట, శ్రీకన్య థియేటర్ ప్రాంతాల్లో మురికివాడల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని, వెలంపేట లక్ష్మీనగర్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేబినెట్‌కు పంపినట్లు చెప్పారు. దువ్వాడ, ఎండాడలో వెండింగ్ జోన్‌ల పనులు వేగంగా సాగుతున్నాయని, సెంట్రల్ పార్క్ వెండింగ్ జోన్‌కు కోర్టు కేసుల కారణంగా జాప్యం ఏర్పడిందని వెల్లడించారు.
31న ప్రౌడ్లీ వైజాగ్ మెగా ఫ్లాష్‌మాబ్
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 31న ఉదయం 6 గంటలకు ప్రౌడ్లీ వైజాగ్ థీమ్ పేరిట ఆర్కేబీచ్‌లో ఫ్లాష్‌మాబ్, బీచ్‌వాక్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
కమిషనర్ కేతన్ గార్గ్


