మెగా డీఎస్సీ అక్రమాలపై యువత గళమెత్తాలి | - | Sakshi
Sakshi News home page

మెగా డీఎస్సీ అక్రమాలపై యువత గళమెత్తాలి

Jul 28 2026 1:42 AM | Updated on Jul 28 2026 1:42 AM

● వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలి ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపు

సాక్షి, విశాఖపట్నం: మెగా డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై యువత పెద్దఎత్తున ఉద్యమించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. సోమవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో యువజన, విద్యార్థి విభాగాల సమావేశం నిర్వహించారు. అనంతరం కేకే రాజు అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత సమావేశంలో మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కమిటీల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేసే కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలని, పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా వెళ్తాయని అన్నారు. పార్టీ సభ్యత్వ ధ్రువీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి సభ్యుడి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి క్రియాశీల కార్యకర్తలను గుర్తించాలని సూచించారు. భవిష్యత్‌ పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణలో ఈ ప్రక్రియ కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రతి ఉద్యమానికి ప్రధాన లక్ష్యంగా ఉండాలని, నిరుద్యోగ యువత, విద్యార్థులు, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్‌, తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ పర్యవేక్షకుడు గుడిమెట్ల రవిరెడ్డి, పార్టీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, వీసం రామకృష్ణ, పేడాడ రమణికుమారి, కోలా గురువులు, జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, బాణాల శ్రీనివాసరావు, సతీష్‌వర్మ, కొండా రాజీవ్‌గాంధీ, జహీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement