ఉత్తరాంధ్రకు పండగ | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రకు పండగ

Jul 28 2026 1:42 AM | Updated on Jul 28 2026 1:42 AM

● ఆరు రోజులపాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు ● అధికారులకు కలెక్టర్‌ దిశానిర్దేశం

మహారాణిపేట: భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ పేరుతో ఆరు రోజులపాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు పలు దిశానిర్దేశాలు చేశారు. ప్రచార కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, ప్రారంభోత్సవానికి ప్రజలను తరలించేందుకు రవాణా, తాగునీరు, భోజన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఈనెల 30 నుంచి వివిధ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో కౌంట్‌డౌన్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతో పాటు 31న ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నట్లు చెప్పారు. ‘మై డిస్ట్రిక్ట్‌ టేక్స్‌ ఆఫ్‌’ అంశంపై పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్‌, చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు ప్రధానమంత్రి పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కల్పిస్తామని తెలిపారు. పాండ్రంగి తదితర ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అరకు కాఫీ, పసుపు వంటి గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ అవకాశాలను పరిచయం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు, పారిశ్రామికవేత్తల సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భోగాపురం థీమ్‌తో క్రికెట్‌, బీచ్‌ వాలీబాల్‌ పోటీలు, విద్యార్థుల ఫ్లాష్‌మాబ్‌లు, రంగవల్లి పోటీలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. విశాఖలో ఈనెల 30, 31 తేదీల్లో ఐటీ, ఏఐఈఈ సంస్థల భాగస్వామ్యంతో ‘అపర్చునిటీ హబ్‌’ కెరీర్‌ ఎక్స్‌పో, ఆర్‌కే బీచ్‌లో 5కే రన్‌, సైక్లాథాన్‌, డ్రోన్‌ షో, ‘ప్రౌడ్లీ వైజాగ్‌’ బీచ్‌ వాక్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.విద్యాధరి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ అప్పలనాయుడు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement