జగదాంబ: ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ నెల 14న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నానికి రానున్నట్లు పార్టీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్ తెలిపారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావుతో కలిసి ఆయన జీవీఎంసీ 37వ వార్డు జబ్బర్‌తోటలో ఆదివారం పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, మంగళవారం ఉదయం 10.00 నుంచి 10.30 మధ్య జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జబ్బర్‌తోటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. అధిక సంఖ్యలో మత్స్యకారులు నివసించే ఈ ప్రాంతంలో ఆయన రాక సందర్భంగా ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ చెన్నా జానకీరామ్, జిల్లా ఉపాధ్యక్షుడు రెయ్యి డేవిడ్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గనగళ్ల రామరాజు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, ప్రధాన కార్యదర్శి చోడిపిల్లి శివ, నాయకులు గరికిన చంద్రశేఖర్, దైవకుమార్, తాడి రవితేజ, నోళ్ల చంటి, నిమ్మకాయల ఆదిలక్ష్మి, ఆనంద్, కమల్ తదితరులు పాల్గొన్నారు.


