మహారాణిపేట: శుభకార్యాలకు మళ్లీ శుభగడియలు సమీపించాయి. అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో ఈ నెల 19వ తేదీ నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలు తదితర శుభకార్యాలకు ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సందడి నెలకొంటోంది. వేదమంత్రాల నడుమ కొత్త జీవితాలకు శ్రీకారం చుట్టేందుకు వధూవరులు సిద్ధమవుతుండగా, శుభకార్యాలపై ఆధారపడిన వృత్తివర్గాల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
అధిక మాసంతో నెలరోజుల విరామం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చిన అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 15 వరకు శుభముహూర్తాలకు విరామం ఏర్పడింది. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి ప్రధాన శుభకార్యాలు నిర్వహించరు. దీంతో దాదాపు 36 రోజుల పాటు కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సేవలు, పూల వ్యాపారులు, పురోహితులు, ఫోటో–వీడియోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, టెంట్‌హౌస్‌లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు తదితర రంగాలు నిశ్శబ్దంగా మారాయి.
19 నుంచి శుభముహూర్తాల సందడి
నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 19 నుంచి జూలై 10 వరకు వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. వేద పండితుల ప్రకారం జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే జులై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీల్లోనూ శుభకార్యాలు నిర్వహించవచ్చు.
మళ్లీ ఆషాఢ మాసం బ్రేక్
జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢ మాసం (శూన్యమాసం) ఉండటంతో మళ్లీ శుభముహూర్తాలకు విరామం రానుంది. ఆ తర్వాత ఆగస్టు 16 నుంచి మళ్లీ వివాహాలు, ఇతర శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు ప్రారంభమవుతాయి.
జోరందుకున్న బుకింగ్స్
ముహూర్తాల ప్రారంభంతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్ సంస్థలు, డెకరేషన్ నిర్వాహకులు, పూల వ్యాపారులు, బంగారు ఆభరణాల దుకాణాలు, వస్త్ర వ్యాపారులు ఇప్పటికే బుకింగ్స్‌తో బిజీగా మారారు. వివాహాల కోసం జాతకాలు చూపించుకునే వారి రాకతో పురోహితులు, జ్యోతిష్య పండితులు కూడా తీరిక లేకుండా ఉన్నారు.
వేలాది కుటుంబాలకు ఉపాధి
శుభకార్యాలు కేవలం కుటుంబ వేడుకలే కాదు... వేలాది కుటుంబాల జీవనాధారమూ. వివాహాలు, గృహప్రవేశాల వంటి కార్యక్రమాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే వంటవాళ్లు, డ్రైవర్లు, లైటింగ్ సిబ్బంది, పూల వ్యాపారులు, సంగీత బృందాలు, మినరల్ వాటర్ సరఫరాదారులు, కూరగాయల వ్యాపారులు, హోటళ్లు, లాడ్జీలు, రవాణా రంగాలకు మళ్లీ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఏం చేయవచ్చంటే..
అధిక మాసం, మూఢకాలంలో సాధారణంగా వివాహాలు, గృహప్రవేశాలు నిర్వహించకపోయినా, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని పండితులు సూచిస్తున్నారు.
మళ్లీ ముహూర్తాలు ప్రారంభం
ఈ నెల 19వ తేదీ నుంచి అన్ని శుభముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా 36 రోజుల పాటు శుభకార్యాలకు విరామం ఏర్పడింది. దీంతో ఈ రంగాలపై ఆధారపడిన అనేక మందికి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ముహూర్తాలు ప్రారంభం కావడంతో వేలాది మందికి పని దొరకనుంది.
– గంగవరపు భాస్కర పార్వతీశ్వర శర్మ,
యజుస్మార్త పండితుడు,
శ్రీ పార్వతీశ్వర ఆలయం, సీతంపేట
ఈ నెలలో ప్రధాన ముహూర్తాలు
జూన్ : 19, 20, 21, 24, 25, 26, 27, 28
జులై : 1, 2, 3, 4, 5, 8, 9
ఆగస్టు : 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30
సెప్టెంబర్ : 1, 3, 4, 5
అక్టోబర్ : 11, 14, 29, 30
శుభకార్యాల సందడితో మళ్లీ కళకళలాడనున్న వేడుకల సీజన్‌కు జూన్ 19 నుంచి శ్రీకారం చుట్టనుంది.


