ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాలి

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

● జెడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చైర్‌పర్సన్‌ సుభద్ర ● కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం

మహారాణిపేట: సమాజంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించి పరిపాలనపై ప్రజల నమ్మకం పెంచాలని సూచించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జెడ్పీ 1 నుంచి 7వ స్థాయీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించారు. అనకాపల్లి, నర్సీపట్నం డయాలసిస్‌ కేంద్రాల నిర్వహణ, సికిల్‌ సెల్‌ బాధితులకు మెరుగైన వైద్యం, మరో నాలుగు ‘మహాప్రస్థానం’ వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై సభ్యులు చర్చించారు.

ఉపాధి కూలీలకు 125 పనిదినాలు: ఉపాధి హామీ పనుల్లో ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు నమోదులో సాంకేతిక లోపాల వల్ల కూలీలకు పూర్తి వేతనాలు అందడం లేదని సభ్యులు ప్రస్తావించారు. జూలై నుంచి గరిష్టంగా 125 పనిదినాలు కల్పిస్తామని, పనిస్థలాల్లో ఉదయం 9.30 గంటలలోపు ఓఆర్‌ఎస్‌, తాగునీరు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలని సుభద్ర అధికారులను ఆదేశించారు.

జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పనకు డిమాండ్‌ : సంపతవరం, కొత్తూరు, దార్లపూడి తదితర జగనన్న కాలనీల్లో అప్రోచ్‌ రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సదుపాయాలు లేకపోవడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం జన్‌మన్‌ ఇళ్ల బిల్లులు మ్యాపింగ్‌ జాప్యంతో నిలిచిపోయాయని పేర్కొన్నారు. కింజియా పుట్ట రోడ్డు నిర్మాణానికి వేర్వేరు ఏజెన్సీల ద్వారా ప్రతిపాదనలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలనీల్లో మౌలిక వసతులు తక్షణమే కల్పించాలని చైర్‌పర్సన్‌ కోరారు.

కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అర్హులకు ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు కాలేదని సభ్యులు విమర్శించారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సుభద్ర కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ పి.నారాయణమూర్తి గత సమావేశ నిర్ణయాల అమలు పురోగతిని వివరించారు. డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement