బైక్ రేసర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరిక
శబ్ద కాలుష్యాన్ని పెంచేలా సైలెన్సర్లు మారిస్తే జైలు శిక్ష
సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు
అల్లిపురం: వాహనాల్లో అనధికారిక మార్పులు చేసి భారీ శబ్దాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. హై–బీమ్ లైట్లు, మొబైల్ స్టాండ్ల వినియోగం రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశమున్నందున వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలో యువత కంపెనీ సైలెన్సర్లను తొలగించి, శబ్ద, వాయు కాలుష్యాన్ని వెదజల్లే మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చడం వల్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గుండె రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీ తెలిపారు. ప్రజల ఫిర్యాదుల మేరకు ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇప్పటివరకు 142 మోడిఫైడ్ సైలెన్సర్లు, 89 హై–బీమ్ లైట్లు, 270 మొబైల్ స్టాండ్లను తొలగించామన్నారు. బీచ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 73 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని, వారి డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేయాలని డీటీసీకి సిఫార్సు చేశామన్నారు.
ఉల్లంఘనలకు కఠిన శిక్షలు
మోడిఫైడ్ సైలెన్సర్లు, హై–బీమ్ లైట్లు వాడితే మొదటి విడతగా 3 నెలల జైలు లేదా రూ.10 వేల జరిమానాతో పాటు లైసెన్స్ జప్తు చేస్తారు. రెండోసారి దొరికితే 6 నెలల జైలు లేదా రూ.10 వేల జరిమానాతో పాటు వాహనం స్వాధీనం చేసుకుంటారు. మొబైల్ స్టాండ్లు ఉంటే ఏడాది వరకు జైలు లేదా రూ. వెయ్యి నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధిస్తారు. బైక్ రేసింగ్‌కు పాల్పడితే 6 నెలల జైలు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు.
ట్రాఫిక్ పోలీసులకు వేసవి కిట్లు
ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల కోసం డీజీపీ మంజూరు చేసిన రూ.6.75 లక్షల నిధులతో కొనుగోలు చేసిన 450 వేసవి కిట్లను సీపీ శంఖబ్రత బాగ్చి సిబ్బందికి పంపిణీ చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న మోడిఫైడ్ సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.


