సురభి నాటకోత్సవాలు ఆరంభం | - | Sakshi
Sakshi News home page

సురభి నాటకోత్సవాలు ఆరంభం

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

మద్దిలపాలెం: కళాభారతి వేదికగా సురభి నాటకోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలను నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ శంఖబత్ర బాగ్చీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాభారతి కార్యదర్శి రాంబాబు, ప్రముఖ సామాజికవేత్త చెరువు రామకోటయ్య, నగర మాజీ డిప్యూటీ మేయర్‌ దాడి సత్యనారాయణ, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వి.వి. రమణమూర్తి, ఉత్తరాంధ్ర కళాకారుల సంఘం కార్యదర్శి మారుతి ప్రసాద్‌, జీవీఎంసీ కార్మిక నాయకులు వామనరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్‌ మాట్లాడుతూ పౌరాణిక నాటకాలను ఆధునిక సాంకేతికత, సినిమాటిక్‌ సెట్టింగ్‌లతో అద్భుతంగా ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కళల పట్ల విశాఖ ప్రజలకు ఉన్న ఆదరణకు ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన ప్రేక్షకులే నిదర్శనమని పేర్కొన్నారు. కళలను పరిరక్షించడం, ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం ప్రదర్శించిన ‘భక్త ప్రహ్లాద’ నాటకం ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. నాటకంలోని నటీనటుల అభినయం, రంగస్థల అలంకరణ, సాంకేతిక విన్యాసాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో రంగస్థల నటుడు, రచయిత కొరిటాల ప్రభాకరరావు, నటులు మేడ మస్తాన్‌రెడ్డి, బ్రహ్మకుమారి రమక్క, బాదంగీర్‌ సాయి సతీమణి హైమావతి, కార్యక్రమ నిర్వాహకురాలు శివజ్యోతి, భానోదయ నాట్యమండలి అధ్యక్షుడు ఆర్‌. నాగబాబు, కార్యదర్శి ఆర్‌. కోటేశ్వరరావు, సమన్వయకర్త భానుప్రసాద్‌, ఉపాధ్యక్షుడు మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌. నాగేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement