‘ఆశ’ నియామకాల్లో ‘కాసుల’ మాయాజాలం
వైద్య ఆరోగ్య శాఖలో దొడ్డిదారిన పోస్టుల పంపకాలు
ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో రేటు ఫిక్స్ చేసిన కూటమి నేతలు
తెరవెనుక గుట్టుగా 51 పోస్టుల భర్తీ
వాటాలు వేసుకుని, పోస్టులు అమ్ముకుంటున్న అధికారపార్టీ నేతలు
ఇంత జరుగుతున్న ఉన్నతాధికారుల మౌనం
● ‘ఆశ’దోశ.. అప్పనంగా ఇచ్చేస్తామా..
మహారాణిపేట: నగర పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ‘ఆశ’ కార్యకర్తల నియామకాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సేవా భావంతో పనిచేసే ఈ పోస్టులను కొందరు కూటమి నేతలు కాసుల కురిపించే కామధేనువుగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన పేద మహిళలకు దక్కాల్సిన ఉద్యోగాలను దొడ్డిదారిన విక్రయిస్తూ, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి భారీ వసూళ్లకు తెరలేపారు. ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయల రేటు ఫిక్స్ చేసి, అర్హతలను పక్కనబెట్టి అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కూటమి పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
తెర వెనుక రాజకీయం
నగర పరిధిలో ఖాళీగా ఉన్న 68 ఆశ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయగా, ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో వందలాది మంది పేద, మధ్యతరగతి మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎంతో ఆశతో ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ, పారదర్శకంగా జరగాల్సిన ఈ ప్రక్రియ అంతా తెరవెనుక రాజకీయం అయిపోయింది. నిజమైన అర్హులను పక్కనబెట్టి, కూటమి నాయకులు చెప్పిన వారికే పోస్టులు కట్టబెట్టేలా ముందే స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొత్తం 68 పోస్టులకు గాను, ఇప్పటివరకు 51 పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా అత్యంత రహస్యంగా భర్తీ చేసేశారు. ఎంపికై న వారి జాబితాను కూడా బహిరంగంగా ప్రదర్శించకపోవడంతో ఎవరికి ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంటర్వ్యూలు కేవలం కంటితుడుపు చర్యగానే నిర్వహించారని, మిగిలిన 16 పోస్టుల భర్తీ కోసం కూడా ప్రభుత్వం అనుమతి కోరుతూ లేఖ రాయడం విశేషమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ గతంలోనే ప్రారంభం కావాల్సి ఉన్నా, అప్పట్లో జీవీఎంసీ కార్పొరేటర్ల జోక్యం, సిఫార్సుల పట్టుదల వల్ల ఆలస్యమైంది. అయితే ఇటీవల కార్పొరేటర్ల పదవీకాలం ముగిసిపోవడాన్ని కొందరు కూటమి నేతలు లూప్‌హోల్‌గా మార్చుకున్నారు. ప్రజాప్రతినిధులు లేని సమయాన్ని చూసి రంగంలోకి దిగిన నేతలు నియోజకవర్గాల, మండలాల, వార్డుల వారీగా పోస్టులను పంచుకున్నారు. తమ మధ్య గొడవలు రాకుండా ముందే వాటాలు వేసుకుని, రేట్లు ఖరారు చేసి బేరసారాలు సాగించి అమ్ముకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ కాసుల కక్కుర్తిలో అర్హులైన పేద మహిళల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది.
వైద్యశాఖ మౌనం
ఈ దొడ్డిదారి నియామకాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తిగా మౌనం వహిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి వారు ఇచ్చిన లిస్టులనే ఫైనల్ చేస్తూ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం వెనుక పెద్ద గూడుపుఠాణీయే ఉందని స్థానికులు మండిపడుతున్నారు. పారదర్శకత లేని ఈ నియామకాలను వెంటనే రద్దు చేసి ప్రతిభ, అర్హత, సీనియారిటీ ఆధారంగానే పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దొడ్డిదారిన జరిగిన ఈ 51 పోస్టుల భర్తీపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన నేతలు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.


