మహారాణిపేట: హోంమంత్రి వంగలపూడి అనితకు మర్యాద తెలియదని, తన పదవిని కాపాడుకోవడానికే ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె. సుభద్ర విమర్శించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమెతో పాటు పలువురు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం తగదన్నారు. హోంమంత్రి అనిత వైఎస్ జగన్‌తోపాటు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రులుగా పనిచేసిన తానేటి వనిత, మేకతోటి సుచరిత హుందాగా వ్యవహరించారని గుర్తు చేశా రు. వైఎస్ కుటుంబానికి, గుడివాడ అమర్‌నాథ్‌కు హోంమంత్రి అనిత బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ అవకతవకలపై చర్చకు సిద్ధమా?
డీఎస్సీ నియామకాలు, సూపర్ సిక్స్ హామీల అమలుపై బహిరంగ చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని సుభద్ర ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ముందుకు రావాలని సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ‘పులివెందుల ఎమ్మెల్యే’ అంటూ ఏకవచనంతో సంబోధించడం మంత్రి అనితకు తగదన్నారు. రాజకీ య విమర్శలు హుందాగా ఉండాలని, మర్యాదపూర్వకంగా మాట్లాడితే తాము కూడా అదే విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ హామీల పరిస్థితి ఏంటి?
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని అమలు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని సుభద్ర డిమాండ్ చేశారు. కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, కొత్త రేషన్ కార్డుల జారీ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం అనేక మంది అర్హులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని సుభద్ర డిమాండ్ చేశారు.
మహిళల భద్రతపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగికదాడులు, హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని సుభద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు పెరిగాయని ఆరోపించారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన గిరిజన మహిళ హత్య ఘటనపై ఇప్పటివరకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గానీ, హోంమంత్రి స్పందించలేదన్నారు. మహిళల భద్రతను పక్కనపెట్టి రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.


