మర్రిపాలెం: బిర్లా జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన వై.నవీన్ కుమార్, ఉప్పాడకు చెందిన జి.అప్పలరాజు రియల్ ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో వీరిద్దరూ ఊర్వశి జంక్షన్ నుంచి ఎన్‌ఏడీ వైపు బైక్‌పై వస్తున్నారు. బిర్లా జంక్షన్ వద్ద గ్రీన్‌సిగ్నల్ ఉండటంతో వీరు ముందుకు సాగగా, ఒక్కసారిగా హుండాయి షోరూం వైపు నుంచి ఓ కియా కారు అతివేగంగా దూసుకొచ్చి వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్‌ను బేఖాతరు చేస్తూ అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


