11 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి | - | Sakshi
Sakshi News home page

11 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

రోగనిరోధక శక్తి లోపంతో

బాధపడుతున్న సహస్ర

చిన్న ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా

విలవిల్లాడుతున్న చిన్నారి

శాశ్వత చికిత్సకు రూ.30 లక్షల వరకు

అవసరం

ఆదుకోవాలని దాతలను వేడుకుంటున్న

తల్లిదండ్రులు

పెందుర్తి: కంటిపాప కళ్ల ముందే కరిగిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం వివాహమైన ఆ దంపతులకు నాలుగేళ్ల క్రితం పుట్టిన తొలి సంతానం పొత్తిళ్లలోనే కన్నుమూసింది. ఆ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. ‘తమ ఇంటి వెలుగు’ అని మురిసిపోతూ 11 నెలల క్రితం మరో పాపాయికి జన్మనిచ్చారు. నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఆ చిన్నారికి ‘సహస్ర’ అని పేరు పెట్టుకున్నారు. ఆ బోసినవ్వులు చూసి మురిసిపోయేలోపే విధి మళ్లీ పగబట్టింది. అరుదైన రోగనిరోధక శక్తి లోపం రూపంలో ఆ పసిప్రాణాన్ని మహమ్మారి చుట్టుముట్టింది.

ఏ చిన్న ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా ముప్పే..!

వేపగుంట బీసీ కాలనీకి చెందిన శానాతి సురేష్‌, సత్యవతి దంపతుల కుమార్తె సహస్ర (11 నెలలు). పుట్టిన రెండు నెలల తర్వాత రోజురోజుకూ బలహీనపడటం ప్రారంభమైంది. పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా.. పాప శరీరంలో వ్యాధి నిరోధక కణాలు పూర్తిగా క్షీణించిపోతున్నాయని, రక్షణ వ్యవస్థ పనిచేయడం మానేసిందని రిపోర్టులు తేల్చాయి. ప్రతి లక్ష మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి వల్ల.. సహస్రకు ఏ చిన్నపాటి ఇన్‌ఫెక్షన్‌ సోకినా ప్రాణాలకే ముప్పు వస్తోంది. ఇప్పటివరకు పాప ప్రాణాలను నిలుపుకోవడం కోసమే తండ్రి సురేష్‌ తన సంపాదనతో పాటు, అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాడు.

దాతలు కనికరిస్తేనే పసిప్రాణం నిలుస్తుంది

ప్రస్తుతం సహస్ర ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. పాపకు శాశ్వత చికిత్స అందించకపోతే ప్రాణాలకే ప్రమాదమని, అందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఒకవైపు కళ్లెదుటే కూతురు క్షీణించిపోతుంటే, మరోవైపు చికిత్సకు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘మొదటి బిడ్డను పోగొట్టుకుని ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు ఈ చిన్నారిని కూడా కోల్పోతే మేము బతకలేం. అంత స్థోమత మాకు లేదు. దాతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చొరవ తీసుకుని మా పాపను కాపాడాలి’ అంటూ తండ్రి సురేష్‌, తల్లి సత్యవతి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. దాతలు 8341114844, 9885503665 నంబర్లకు సంప్రదించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement