ఉపాధి కూలీకి వేతన..యాతన! | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీకి వేతన..యాతన!

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

ఆరు నెలలుగా అందని వేతనాలు రూ.5.69 కోట్లు బకాయి పెట్టిన ప్రభుత్వం పని ప్రదేశాల్లో నీడ లేదు.. గుక్కెడు నీళ్లు లేవు జిల్లాలో 35 వేల మంది అవస్థలు

మహారాణిపేట: గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు కొండంత ఆసరాగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది కూలీలు పనులు చేసినా, వారికి రావాల్సిన వేతనాలు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరు నెలలుగా పైసా విదిల్చకపోవడంతో వారంతా అవస్థలు పడుతున్నారు. మరోవైపు మండుతున్న ఎండల్లో పని ప్రదేశాల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో కూలీల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

ఆరు నెలలుగా ఆకలి కేకలు

జిల్లాలో సుమారు 35,294 మంది కూలీలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆరు నెలలుగా వీరికి వేతనాలు విడుదల కాకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కో కూలీకి వేల రూపాయల బకాయిలు రావాల్సి ఉండగా, ప్రభుత్వం నిధుల కొరత సాకుతో కాలయాపన చేస్తోంది. పనులు ముగిసి మస్టర్లు సమర్పించినా, ఆన్‌లైన్‌ సాంకేతిక సమస్యలంటూ అధికారులు కుంటిసాకులు చెబుతున్నారు. తమ కష్టార్జితం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారుల లెక్కల ప్రకారం.. అనకాపల్లి జిల్లాలో రూ.4.56 కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.5.69 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.2.75 కోట్లు వేతన బకాయిలు ఉన్నాయి. చేసిన పనికి డబ్బులు ఇవ్వాలని కోరితే అధికారులు ముఖం చాటేస్తున్నారని కూలీలు వాపోతున్నారు.

ఎండకు ఎండుతూ..

వసతులు లేక అల్లాడుతూ..

రాష్ట్రంలో భానుడి భగభగలకు ఉపాధి కూలీలు విలవిల్లాడుతున్నారు. నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో చలువ పందిళ్లు, మంచినీరు, మెడికల్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి.

కానీ, జిల్లాలో ఎక్కడా ఈ వసతులు కానరావడం లేదు. కనీసం గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకపోవడంతో కూలీలే ఇళ్ల నుంచి బాటిళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. చెట్ల నీడ కూడా లేని చోట్ల పనులు చేయిస్తుండటంతో వడదెబ్బ తగిలి కూలీలు సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలు నిత్యం నమోదవుతున్నాయి. అపాయం సంభవిస్తే ప్రాథమిక చికిత్స చేసేందుకు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు కూడా లేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.

పట్టించుకోని

అధికార యంత్రాంగం

కూలీల సంక్షేమాన్ని ప్రస్తుత ప్రభుత్వం విస్మరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. 35 వేల మందికి పైగా కూలీల కుటుంబాలకు కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే జిల్లా యంత్రాంగం గానీ, మంత్రులు గానీ స్పందించకపోవడం దారుణం. కేవలం రాజకీయ ప్రచారాలకే ప్రాధాన్యత ఇస్తున్న నేతలు, కూలీల వేతనాల విడుదలపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో చూపిస్తున్న శ్రద్ధ, కూలీల చెమట చుక్కల విలువను గుర్తించడంలో చూపడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement