దారి వివాదం.. ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

దారి వివాదం.. ఆత్మహత్యాయత్నం

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

ఆరిలోవ: జీవీఎంసీ 9వ వార్డు పరిధిలోని దేవస్థానం కొండవాలు ప్రాంతం.. సంజయ్‌గాంధీ కాలనీ ప్రశాంతినగర్‌లో దారి వివాదం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు దారితీసింది. ఆ గొడవ కాస్తా ముదిరి ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసే వరకు వెళ్లింది. బాధితుడు రాజేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. సింహాచలం దేవస్థానం కొండపై గతంలో రాజేశ్వరరావు కుటుంబ పెద్దలు ఇల్లు నిర్మించుకున్నారు. స్థానికుల సౌకర్యార్థం ఇంటి పక్కన పైకి వెళ్లేందుకు సుమారు 4 అడుగుల వెడల్పుతో దారి వదిలారు. ఆ స్థలంలో కొన్నేళ్ల కిందట జీవీఎంసీ మెట్లు నిర్మించింది.

అయితే, ప్రస్తుతం ఆ దారి పక్కన ఉన్న దేవస్థానం ఖాళీ స్థలం తనదేనంటూ ఓ వ్యక్తి మూడు రేకుల షెడ్లు నిర్మించాడు. అంతటితో ఆగకుండా మెట్ల మార్గాన్ని ఆనుకొని ప్రహరీ కట్టడమే కాకుండా, దారికి అడ్డంగా గేటు కూడా ఏర్పాటు చేశాడు. పబ్లిక్‌ దారిని ఎలా మూసివేస్తారని రాజేశ్వరరావు ప్రశ్నించగా, సదరు వ్యక్తి ఆయనతో గొడవకు దిగాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరరావు ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే చాకుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను విమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. విమ్స్‌ వైద్యుల సమాచారంతో ఆరిలోవ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కాగా.. దేవస్థానానికి చెందిన ఖాళీ స్థలంలో అక్రమంగా రేకుల షెడ్లు నిర్మించి, పబ్లిక్‌ దారిని మూసేసినా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్నా దేవస్థానం అధికారులు మౌనం వహించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ప్రశాంతినగర్‌లో అక్రమ నిర్మాణాలు?

Advertisement
 
Advertisement
Advertisement