సమరశీల పోరాటాలకు సిద్ధం కండి | - | Sakshi
Sakshi News home page

సమరశీల పోరాటాలకు సిద్ధం కండి

May 2 2026 11:49 AM | Updated on May 2 2026 11:49 AM

బీచ్‌రోడ్డు: మే డే అమరవీరుల పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ.. కార్మిక హక్కుల రక్షణ కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆశీలమెట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్‌ మీదుగా దొండపర్తి రైల్వే డీఆర్‌ఎం ఆఫీస్‌ వరకు వర్షంలోనూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్‌, ఆటో, క్యాబ్‌, ఆశ, ఆర్‌.పి, ముఠా కార్మికులు, తోపుడు బండ్ల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డీఆర్‌ఎం ఆఫీస్‌ వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షులు పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎం.జగ్గునాయుడు, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పి.మణి మాట్లాడుతూ 140 ఏళ్ల క్రితం ప్రాణత్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని, 44 కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తోందని నేతలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, డైరీ, సినర్జీస్‌ కంపెనీల్లో సుమారు 7,000 మందికి పైగా కార్మికులను విధుల్లోంచి తొలగించడం దుర్మార్గమని విమర్శించారు. కార్మికులందరికీ కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని, సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్‌ కంపెనీలకు (మిట్టల్‌) రాయితీలు ఇవ్వడంపై మండిపడ్డారు. ఆశ, అంగన్‌వాడీ, మధ్యాహ్నం భోజన పథకం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని నేతలు ప్రభుత్వాన్ని కోరారు. సభలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తీన్మార్‌ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమావేశంలో జగదాంబ జోన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌, కంచరపాలెం జోన్‌ కార్యదర్శి అప్పారావు, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.నూకరాజు, విశాఖ జిల్లా ముఠా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు పైడిరాజు, ఎం.సుబ్బారావు, ఆర్పి యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement