మహారాణిపేట : సముద్ర గర్భం అప్పుడప్పుడు అపురూపమైన సంపదను మత్స్యకారులకు కానుకగా ఇస్తుంటుంది. ప్రస్తుతం వేట నిషేధ కాలం కొనసాగుతున్న వేళ, జీవనోపాధి కోసం తెప్పలపై వేటకు వెళ్తున్న మత్స్యకారులకు ఊహించని అదృష్టం వరించింది. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ కాయం కలిగిన కొమ్ముకోనాం చేపలు సందడి చేశాయి.
సముద్ర గర్భాన భారీ సమరం
గురువారం తెప్పలపై వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు ఒక్కసారిగా భారీ బరువు తగిలింది. ఏదో పెద్ద చేప చిక్కిందని సంబరపడ్డ వేటగాళ్లకు, అది కొమ్ము కోనాం అని తెలియగానే వారి ఆనందానికి అవధులు లేవు. ఒక్కో చేప సుమారు 12 నుంచి 20 కిలోల వరకు తూగింది. 4 అడుగుల నుంచి ఏకంగా 8 అడుగుల పొడవున్న చేపలు వలకు చిక్కాయి. ఈ భారీ చేపలను పడవలోకి ఎక్కించడం మత్స్యకారులకు ఒక సవాలుగా మారింది. సముద్ర అలల మధ్య అతి కష్టం మీద వాటిని తాళ్లతో బంధించి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
మార్కెట్లో భలే గిరాకీ.. : ఈ కొమ్ము కోనాం చేపలకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ చేపలను కేరళ వాసులు అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తారు. అక్కడి రుచుల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కో పెద్ద చేప సుమారు రూ. 25,000 వరకు ధర పలికింది. వేట నిషేధ కాలంలో ఉపాధి కరువై ఇబ్బంది పడుతున్న సమయంలో, ఇలాంటి భారీ చేపలు పడటం మాకు నిజంగా దేవుడు ఇచ్చిన వరమే.. అని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హార్బర్‌లో కొమ్ము కోనాం సందడి


