సబ్బవరం: విధి నిర్వహణ కోసం బయలుదేరిన హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సబ్బవరం మండలంలో జరిగిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. వివరాలివి.. అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తూ, పరవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె.పి.ఆర్.వి.ఎన్. ప్రసాద్ శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే వారాంతపు నివేదికల సమర్పణ కోసం ఆయన సుజాతనగర్ నుంచి అనకాపల్లికి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సబ్బవరం మండలం ఇరువాడ వద్ద ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, వెనుకనే అతి వేగంగా వచ్చిన ఒక కారు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. 2000 బ్యాచ్‌కు చెందిన ప్రసాద్ తన వృత్తి జీవితాన్ని విశాఖపట్నం సిటీ పరిధిలో కానిస్టేబుల్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత 2 టౌన్, 4 టౌన్ శాంతి భద్రతల విభాగాలతో పాటు హార్బర్, స్టీల్ ప్లాంట్, పెందుర్తి ట్రాఫిక్ విభాగాల్లో పనిచేశారు. ఎంవీపీ కాలనీ క్రైమ్ విభాగంలో, సిటీ స్పెషల్ బ్రాంచ్‌లోనూ ఆయన సేవలు అందించారు. జిల్లాల పునర్విభజన అనంతరం అనకాపల్లి జిల్లాకు కేటాయించడంతో.. ఆయన పరవాడ పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని సహచర సిబ్బంది తెలిపారు. క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచారాన్ని సేకరించడంలో ఆయనకు ఉన్న నేర్పును ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
పోలీస్ శాఖ దిగ్భ్రాంతి
హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మృతి పట్ల అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పోలీస్ శాఖ తరపున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రసాద్ కుమారుడు చదువులో ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ చేతుల మీదుగానే పురస్కారం అందుకోవడం ఆ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. అయితే ఆ సంతోషం మరువక ముందే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో తీవ్ర వేదనను మిగిల్చింది. సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విషాదం


