విశాఖ సిటీ: వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ అధికారులకు సూచించారు. మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్‌తో కలిసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పని చేయాలని సూచించారు. విభాగంలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించామని, ఉద్యోగులందరూ తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లోని ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్లు, రహదారుల నిర్మాణం, కార్యాలయ నిర్వహణ వంటి అంశాలను నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీఈ వినయ్ కుమార్, ఎస్‌ఈలు భవానీశంకర్, మధు, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


