చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

మహారాణిపేట: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కీలక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఉత్సవంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలపై దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఆలయ పండితులు వివరించారు. అనంతరం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్‌ శాఖల వారీగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పోలీస్‌ శాఖ పర్యవేక్షించగా, రవాణా సౌకర్యాల విషయంలో ఏపీఎస్‌ ఆర్టీసీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూ.1500, రూ.1000 టికెట్లపై పికప్‌, డ్రాప్‌ పాయింట్ల వివరాలు స్పష్టంగా ముద్రించాలని పేర్కొన్నారు. వాహనాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగ్గా కల్పించాలని చెప్పారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయడంపై గతంలో అమలు చేసిన నిబంధనలను పాటించాలని తెలిపారు. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ఇతర అవసరమైన వసతుల ఏర్పాటు విషయంలో సంబంధిత శాఖలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దాతలు నిర్వహించే అన్నదాన కేంద్రాలను ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేసి ఆహార నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 17వ తేదీ నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, భీమిలి ఆర్డీవో సంగీత్‌ మాధుర్‌, జీవీఎంసీ సిఎం నరేశ్‌, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్యాంబాబు, డీఎంహెచ్‌వో పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు.

కీలక శాఖలతో కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement