మహారాణిపేట: గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించిన అసైన్డ్ ప్రభుత్వ భూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం విశాఖ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండలో ప్రభుత్వ భూముల వినియోగంపై కూడా సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గీతం విశ్వవిద్యాలయం యాజమాన్యం ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములు ఎండాడ, భీమిలి మండలాల పరిధిలోని రుషికొండ ప్రాంతంలో సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ప్రకారం ప్రభుత్వం కేటాయించిన భూములను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రుషికొండ ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన భూమిలో గతంలో ప్రభుత్వ అవసరాల కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగితే, అప్పట్లో కూటమి నాయకులు తీవ్ర విమర్శలు చేసి, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ భవనాలు కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉన్నప్పటికీ, వాటిని ప్రజల అవసరాలకు వినియోగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాకా విమర్శించారు. ఆ భవనాలను కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి దారితీస్తుందని మార్కండేయులు హెచ్చరించారు. గిన్ని రాధాకృష్ణ, విజయ్ భాస్కర్, సుగుణ కుమార్, హరి పట్నాయక్, రామకృష్ణారెడ్డి, మద్ది లక్ష్మణరావు, వెంకటరమణ, పిల్లా అప్పారావు, పైడిరాజు, బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అప్పలస్వామి, చుక్కా అప్పారావు, బోరా రామిరెడ్డి, వీర రాఘవులు, రాజా చంద్రశేఖర్, మహమ్మద్ సలీమ్, వన్‌టౌన్ దాసరి విజయ భాస్కరరెడ్డి, ఎం.డి.జాఫర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు


