రైతులతో ఏపీఐఐసీ చెలగాటం | - | Sakshi
Sakshi News home page

రైతులతో ఏపీఐఐసీ చెలగాటం

Apr 7 2026 9:25 AM | Updated on Apr 7 2026 9:25 AM

● భూములు తీసుకోరు, అమ్ముకోనివ్వరు ● క్రయవిక్రయాలపై ఆంక్షలు ● అర్జీలు ఇచ్చినా స్వీకరించని అధికారులు ● లబోదిబోమంటున్న రైతులు

నక్కపల్లి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది. మండలంలో పలువురు రైతుల పరిస్థితి. బల్క్‌ డ్రగ్‌పార్క్‌, స్టీల్‌ప్లాంట్‌ కోసం భూసేకరణ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. తమ సమస్య పరిష్కరించాలంటూ సోమవారం రైతులు ఇచ్చిన అర్జీలను ఏపీఐఐసీ అధికారులు తీసుకోవడానికి నిరాకరించారంటూ రాజయ్యపేట రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోందంంటూ ఆరోపిస్తున్నారు. కంపెనీల కోసం గుర్తించిన భూముల క్రయ విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు ఏపీఐఐసీ వారు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. తమ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తే వేరొకరికి విక్రయిస్తామని లేదా ప్రభుత్వానికే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజయ్యపేట సర్వేనెంబరు270,270/1ఈ,270/1డీ,271,272, 243/14,15లలో సుమారు10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2017లో ప్రభుత్వం ఎకరా రూ.18 లక్షల చొప్పున సేకరించడానికి నిర్ణయించింది. ఈ భూములు ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు. అధికారులు మాత్రం భూములు తీసుకోకుండా వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో ఆంక్షలు విధించారు. మా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, రైతులు మైలపల్లి మహేష్‌, మైలపల్లి బైరాగి రాజు, బి.అప్పలరాజు, డి. వీర్రాజు, వాసుపల్లి రాము తదితరులు చెబుతున్నారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ జోనల్‌ కార్యాలయానికి వెళ్లి అర్జీ పెట్టుకుంటే జోనల్‌ మేనేజర్‌ నుంచి అనుమతి వస్తేనే తీసుకుంటామని చెబుతున్నారని రైతులు తెలిపారు. భూములు ఎప్పటిలోగా తీసుకుంటారో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేదా అవసరం లేని పక్షంలో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు తొలగిస్తూ జీవో విడుదల చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆంక్షలు తొలగిస్తే మా భూములు వేరొకరికి అమ్ముకుంటామంటూ వారు ప్రాధేయపడుతున్నారు. ఇదే విషయంపై సోమవారం రాజయ్యపేట వచ్చిన ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నర్సింహరావు, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ రాజశేఖర్‌లకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోవడానికి నిరాకరించారని రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాజయ్యపేటలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement