● అరకులోయలో గొంతు కోసిన దుండగులు
● పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో
గొడవలే కారణమా?
అరకులోయ టౌన్/ తెర్లాం (విజయనగరం): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలం, చినలబుడు పంచాయతీ పరిధిలోని హట్టగుడ సమీపంలోని ‘రూప రిసార్ట్స్’ ప్రధాన రహదారిపై పర్యాటకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగింది?
విజయనగరం జిల్లా తెర్లాం మండలం, జన్నివలస గ్రామానికి చెందిన నాగళ్ల సురేష్ (25) రెండేళ్ల కిందట అరకులోని పద్మాపురం వద్ద ఉన్న ఉషోదయ రిసార్ట్స్‌లో పనిచేసేవాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని లలితా జ్యుయలరీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం తన స్వగ్రామంలో జరిగిన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన సురేష్ విజయనగరం వెళ్లివస్తానని ఇంటి వద్ద చెప్పి అరకులోయ వచ్చాడు. ఉషోదయ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న ఓ యువతితో కలిసి అతను రూప రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో లాడ్జిలో పనిచేస్తున్న కొంతమంది యువకులతో సురేష్‌కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గొడవ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన సురేష్‌ను, రిసార్ట్స్ సమీపంలోని రహదారి వద్ద దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాడేరు డీఎస్పీ అభిషేక్ వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. ఈ కేసులో రిసార్ట్స్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అరకులోయ ఎస్‌ఐ గోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి...
విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి మోటార్ సైకిల్‌పై బయలుదేరి వెళ్లిన వ్యక్తి అదే రోజు రాత్రి సమయంలో అరకులోయలో హత్యకు గురైయ్యాడన్న సమాచారం బుధవారం ఉదయం తెలుసుకున్న అతని భార్య, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. జన్నివలసకు చెందిన నాగళ్ల అప్పలనాయుడు, సూరమ్మలకు ముగ్గురు వివాహితులైన కుమారులు, ఒక అవివాహిత కుమార్తె ఉన్నారు. వారిలో సురేష్ మూడవ కుమారుడు. రెండేళ్ల కిందట సురేష్ అరకులోయ మండలం పద్మాపురంలోని ఉషోదయ రిసార్ట్స్‌లో పనిచేసేవాడు. హైదరాబాద్‌లోని లలిత జ్యూయలరీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. సురేష్‌కు ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన తులసితో వివా హం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆలయ ప్రారంభానికి వచ్చి హత్యకు గురికావడంతో కన్నీరుపెడుతున్నారు. సురేష్ మృతితో జన్నివలస గ్రామంలోని యాదవ వీధిలో విషాదం అలముకుంది.


