తగరపువలస: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భీమిలి ప్రాంతంలోని వంటిళ్లలో ‘గ్యాస్ ట్రబుల్స్’సృష్టిస్తోంది. తెల్లవారితే చాలు వినియోగదారులంతా వంట గ్యాస్ గురించే చర్చించుకుంటున్నారు. ఇక డెలివరీ బాయ్స్ పెరిగిన బుకింగ్స్ ఒత్తిడిని తట్టుకోలేక సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. పరిస్థితిని గమనించిన ఏజెన్సీలు, ఒక ఏరియా డెలివరీ బాయ్స్‌ను మరో ప్రాంతానికి పంపిస్తున్నాయి. దీంతో డెలివరీ పాయింట్ల వద్ద వినియోగదారులు ఉదయం నుంచే సిలిండర్ల కోసం నిరీక్షిస్తున్నారు. డెలివరీ బాయ్స్ జాడ లేకపోవడంతో నేరుగా భీమిలిలోని గ్యాస్ ఏజెన్సీలు, గోదాముల వద్దకే వెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు నెల రోజుల వ్యవధి ఉండటంతో, తక్కువగా వాడే వారు ఒక్కో సిలిండర్‌ను రూ.200 అదనంగా వసూలు చేస్తూ బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఏజెన్సీల వద్ద తగినంత నిల్వలు ఉన్నప్పటికీ.. యుద్ధ భయం, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్ల బుకింగ్స్ అసాధారణంగా పెరిగాయని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.
చిట్టివలస జ్యూట్‌మిల్లు లేబర్ వెల్ఫేర్ సెంటర్ వద్ద క్యూ కట్టిన వినియోగదారులు


