కూలిన గోడలు..
పేలుడు జరిగిన భవనం ఇదే..
పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం వెనుక వైపు గోడ పేకమేడలా కూలి పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడింది. కిటికీ ఇనుప గ్రిల్స్ గాలిలో ఎగురుకుంటూ వెళ్లి రెండు వీధుల అవతల పడ్డాయంటే ఆ ధాటి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ‘ఆ సమయంలో వీధిలో ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఇంట్లో మనుషులుంటే ఆ గుర్తు పట్టలేని విధంగా ఛిద్రమైపోయేవారు’ అని ఘటనా స్థలాన్ని చూసిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగకపోవడం కేవలం అదృష్టంగా భావిస్తున్నారు.
ఐదు కేసులున్నా ఆగని ‘వారసత్వ’ అరాచకం
బాణసంచా సూత్రధారి స్థానికుడు దామోదర శివకృష్ణ కుమార్ (బాంబుల శివ). తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన బాంబుల వ్యాపారాన్ని ఏకంగా 40 ఏళ్లుగా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. ఎక్కడో తక్కువ ధరకు బాంబులు కొనుగోలు చేయడం.. జనావాసాల మధ్య ఉన్న ఇంట్లో నిల్వ ఉంచి అమ్మడం ఇతనికి నిత్యకృత్యం. గతంలో ఇతనిపై 5 సార్లు కేసులు నమోదయ్యాయి. పోలీసులు సామగ్రిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేసినా, శివకృష్ణలో మార్పు రాలేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ అక్రమ వ్యాపారం, ఈ పేలుడుతో ఇప్పుడు బహిర్గతమైంది. చట్టాలన్నా, పోలీసులన్నా ఇతనికి లెక్క లేదన్నది బహిరంగ రహస్యం. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గణబాబు సోమవారం సందర్శించారు. నివాస ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రంగంలోకి యంత్రాంగం.. ఆధారాల సేకరణ
క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించి పేలుడుకు సంబంధించిన కీలక ఆనవాళ్లను సేకరించారు. సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ రామారావు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకోగా, తహసీల్దార్ రమేష్, వెస్ట్ జోనల్ కమిషనర్ హేమావతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రామలింగేశ్వరరావు భవన పటిష్టతను పరిశీలించారు. ప్రస్తుతానికి ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేయించి సీజ్ చేశారు. ఐదు కేసులు ఉన్నా ఒక వ్యక్తి 40 ఏళ్లుగా ఇంత సాహసం ఎలా చేయగలుగుతున్నాడు? పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే కదా సామాన్యుల ప్రాణాలు ఫణంగా మారుతున్నాయి? ఇప్పటికై నా యంత్రాంగం కళ్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రాణాలు దక్కడం అదృష్టం
జనావాసాల మధ్య ఇలా బాంబులు నిల్వ చేయడం చాలా దారుణం. పేలుడు ధాటికి వెనుక వైపు గోడ ఎగిరి వచ్చి మా ఇంటిపై పడటంతో రేకుల షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఆదివారం కావడంతో మేమంతా బయటకు వెళ్లాం, లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది. బాంబుల తయారీ కేంద్రాలు, అక్రమ నిల్వలను పూర్తిగా నివారించాలి. ఈ ప్రమాదం వల్ల మేము భారీగా నష్టపోయాం. అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
–పి.కాశీనాథ్, ఆదర్శనగర్
చావు అంచుల దాకా..
మా ఇంటి సమీపంలోని ఉన్న భవనంలో బాంబులు తయారు చేస్తున్నారన్న విషయం తెలియదు. పేలుడు సంభవించిన ప్పుడు మేమెంతా బయట లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ ఆ శబ్దానికి, భయంకరమైన అదురుకు తీవ్ర ఆందోళనకు గురయ్యాం. మా వదిన ఆ ధాటికి భయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాం. కానీ ఆ భయం నుంచి తను ఇంకా కోలుకోలేదు. జనావాసాల మధ్య ఇలాంటి బాంబుల నిల్వలు లేకుండా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
–హెప్సిబా, ఆదర్శనగర్
ఆదర్శనగర్‌లో బాణసంచా పేలుడు
అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
బాంబుల శివ అరాచకం..
పోలీసు కౌన్సెలింగ్ పట్టించుకోని వైనం
40 ఏళ్లుగా వారసత్వ వ్యాపారం..
అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
అది కేవలం బాణసంచా పేలుడు కాదు.. జనావాసాల మధ్య పొంచి ఉన్న మృత్యువు
విసిరిన పంజా..జీవీఎంసీ 89వ వార్డు ఆదర్శనగర్ శ్మశానవాటిక సమీపంలో ఆదివారం
రాత్రి సంభవించిన బాణసంచా పేలుడు ఘటన సృష్టించిన బీభత్సం చూస్తుంటే స్థానికులు
ఇప్పటికీ వణికిపోతున్నారు. చీకట్లో కేవలం మంటలు, పొగ మాత్రమే కనిపించినా..
సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన దృశ్యాలు ఆ ప్రాంతాన్ని రణరంగంగా
తలపించాయి. – గోపాలపట్నం
నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం
గతంలోనే బాంబుల శివపై 5 కేసులు నమోదు చేశాం. ఈ ప్రమాదకరమైన వృత్తిని మానుకుని, వేరే పని చూసుకోమని పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నాం.
–సన్యాసినాయుడు, సీఐ, గోపాలపట్నం


