మహారాణిపేట: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి భారీగా వినతులు వచ్చాయి. కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 278 అర్జీలు నమోదయ్యాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఇన్‌చార్జి డీఆర్వో శేషశైలజ, ఏడీసీ సత్యవేణిలు వినతులు స్వీకరించారు. వినతుల్లో జీవీఎంసీకి సంబంధించి 94, పోలీస్ శాఖకు 26, ఇతర శాఖలకు సంబంధించి 158 ఉన్నాయి. ప్రధానంగా సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాల మంజూరు, రైతు బజార్లలో దుకాణాల కేటాయింపు, లేఅవుట్ల క్రమబద్దీకరణ, ఇంటి పన్నులు, శాంతిభద్రతల సమస్యలపై ప్రజలు అధికారులకు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు.


