ఆ‘లివ్‌’ రిడ్లే.. | - | Sakshi
Sakshi News home page

ఆ‘లివ్‌’ రిడ్లే..

Mar 15 2026 1:31 AM | Updated on Mar 15 2026 1:31 AM

● తాబేళ్ల పునరుత్పత్తికి ప్రత్యేక కేంద్రాలు ● చిట్టి తాబేళ్లకు తీరంలో ప్రాణదానం ● బుడిబుడి అడుగులతో.. సంద్రం ఒడికి!

‘అల’సట ఎరుగని వలస జీవులకు విశాఖ అభయం

కొమ్మాది: సముద్రం ఎన్నో అద్భుత జీవరాశులకు ఆవాసం. అందులో ఒక అరుదైన, అలసట ఎరుగని వలస జీవి ఆలివ్‌ రిడ్లే తాబేలు. ఏ సరిహద్దులూ లేని సాగరంలో.. అలుపెరగని అలల తోడుగా వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. కేవలం సంతానోత్పత్తి కోసమే ప్రతి ఏడాదీ తూర్పు తీరానికి చేరుకుంటాయి. ఒకవైపు పొంచి ఉన్న ముప్పు, మరోవైపు అటవీ శాఖ, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న అభయం మధ్య వాటి పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తూ సంద్రం ఒడికి చేరుకుంటున్నాయి. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ జాబితాలో హానికి లోనయ్యే జాతులుగా వర్గీకరించబడిన ఈ తాబేళ్ల రక్షణకు తూర్పు తీరం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.

అలుపెరుగని ప్రయాణం

ఆలివ్‌ రిడ్లే తాబేళ్లకు స్థిర నివాసం అంటూ ఉండదు. సుమారు రెండు అడుగుల పొడవు, 35 నుంచి 50 కిలోల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహార అన్వేషణ, సంతానోత్పత్తి కోసం మహా సముద్రాల్లో దాదాపు 20 వేల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. వీటిల్లో ఏడు జాతులు ఉండగా 5 జాతులు జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల నుంచి ఏపీ, ఒడిశా తీరాలకు వలస వస్తుంటాయి. వీటి ప్రయాణాన్ని ట్రాక్‌ చేసేందుకు అటవీశాఖ శాటిలైట్‌ ట్యాగింగ్‌ విధానాన్ని కూడా వాడుతోంది. ఇటీవల ట్యాగ్‌ చేసిన ఒక తాబేలు కేవలం 51 రోజుల్లో 1000 కిలోమీటర్లు ప్రయాణించినట్లు గుర్తించింది.

అర్ధరాత్రి తీరంలో సందడి

నవంబర్‌ నుంచి మే వరకు వీటి సంతానోత్పత్తి కాలం. డిసెంబర్‌–ఫిబ్రవరి మధ్యలో ఇవి ఎక్కువగా వస్తుంటాయి. విశాఖ సాగరతీరం వీటికి ఇష్టమైన ప్రదేశం. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల మధ్య తీరానికి చేరుకుని, ఇసుకలో గోతులు తవ్వి 50 నుంచి 150 గుడ్ల వరకు పెడతాయి. గుడ్లపై ఇసుక కప్పి తల్లి తాబేళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. గుడ్లు పొదిగే ఇసుక ఉష్ణోగ్రత పిల్లల లింగాన్ని నిర్ణయిస్తుంది. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగితే మగ తాబేళ్లుగానూ, 30–32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగితే ఆడ తాబేళ్లుగానూ ప్రాణం పోసుకుంటాయి. అయితే పిల్లలుగా మారిన వెంటనే వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం విశేషం.

పొంచి ఉన్న ముప్పు

తీరంలో తాబేళ్లు గుడ్లు పెట్టి వెళ్లిన తర్వాత వాటికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఉదయం పూట పర్యాటకుల తాకిడి, కుక్కలు, నక్కలు వంటి జంతువుల దాడులు, అలాగే సముద్రంలో వేటగాళ్ల వలలకు చిక్కుకుని ఎన్నో గుడ్లు, తాబేళ్లు నశించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలివ్‌ రిడ్లే జాతి అంతరించిపోకుండా అటవీశాఖ ఆద్వర్యంలో సాగర్‌నగర్‌, జోడుగుళ్లపాలెం, చేపలుప్పాడ, పెదనాగమయ్యపాలెం ప్రాంతాల్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్ట్‌టైం ఉద్యోగులు, స్థానిక మత్స్యకారుల సహాయంతో తీరంలో అసురక్షిత ప్రాంతాల్లో ఉన్న గుడ్లను సేకరించి, ఈ కేంద్రాల్లో సురక్షితంగా సంరక్షించి.. పొదిగిస్తున్నారు.

సంద్రం ఒడికి పయనం..

సంరక్షణ కేంద్రాల్లో సేకరించిన గుడ్లను సుమారు 40 నుంచి 45 రోజుల పాటు రక్షణ వలయంలో ఉంచుతారు. గుడ్లు పొదిగి పిల్లలుగా మారిన తర్వాత, అటవీశాఖ అధికారులు ఆ చిట్టి తాబేళ్లను విడతల వారీగా సముద్రంలోకి విడిచిపెడతారు. అవి బుడిబుడి అడుగులు వేస్తూ అలల మీద సముద్రంలోకి కలిసిపోతున్న దృశ్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఈ తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement