ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే..
ఏయూక్యాంపస్: ప్రాంతాలు వేరైన దేశ ప్రజలంతా ఒక్కటేనని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు అన్నారు. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యూత్ హాస్టల్స్‌లో శుక్రవారం మొదలైన అంతర్ రాష్ట్ర యువ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి కు చెందిన ఎనిమిది మంది యువతులు సహా 37 మంది పాల్గొన్న ఈ సమ్మేనాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మినీ ఇండియా పిలువబడుతున్న విశాఖపట్నం ఎన్నో అనుభూతులను అందిస్తుందన్నారు. ఇక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార అలవాట్లు గురించి తెలుసుకోవాలని సూచించారు. ఏపీ విభిన్న ప్రతిభావంతులు శాఖ సహాయ సంచాలకులు కవిత మాట్లాడుతూ ఈ పర్యటనలో తేనెలొలికే తెలుగు భాషలో పదాలు నేర్చుకోవాలని యువతకు సూచించారు. మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి విశాఖ జిల్లా యువ అధికారి జి.మహేశ్వరరావు యువ సమ్మేళనం ప్రత్యేకత, నిర్వహణను వివరించారు. సీనియర్ జర్నలిస్టు నాగనబోయిన నాగేశ్వరరావు, పురాతన వస్తువులు సేకరణకర్త, ఉపాధ్యాయుడు కోరుపోలు గంగాధర రావు, రాజీవ్ గాంధీ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్, మేరా యువ భారత్ పూర్వ ఉద్యోగి అల్లం రామ్‌ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం యువ సమ్మేళనం గోడ పత్రికను అతిథులు ఆవిష్కరించారు. మేరా యువ భారత్ ప్రతినిధులు కె. శ్రీనివాసరావు, ప్రసన్న గోపాల్, వలంటీర్లు జేమ్స్, ప్రసన్న కుమార్, జ్ఞానదీప్, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువ సమ్మేళనంలో భాగంగా కోరుపోలు గంగాధర రావు ఏర్పాటు చేసిన పురాతన వస్తు ప్రదర్శన యువతను ఎంతగానో ఆకర్షించింది.
ఉత్సాహంగా అంతర్ రాష్ట్ర
యువ సమ్మేళనం


