ఎస్‌ఈది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

Jan 24 2026 8:56 AM | Updated on Jan 24 2026 8:56 AM

ఎస్‌ఈది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ఎస్‌ఈది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

● పట్టాభి, పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌ వేధింపులతోనే ఎస్‌ఈ గోవిందరావు మృతి ● సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్‌

● పట్టాభి, పల్లా శ్రీనివాస్‌, గంధం శ్రీనివాస్‌ వేధింపులతోనే ఎస్‌ఈ గోవిందరావు మృతి ● సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ● వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్‌

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) గోవిందరావు మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఎస్‌ఈ మృతికి కారణమైన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ గంధం శ్రీనివాస్‌లను తక్షణమే అరెస్ట్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్న ఎస్‌ఈ మృతదేహానికి శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఒత్తిడి తట్టుకోలేకే గుండెపోటు

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎస్‌ఈ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకే మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్‌, కమిషనర్‌ లేకుండానే పట్టాభి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్‌ గంధం శ్రీనివాస్‌ తమ స్వప్రయోజనాల కోసం ఒక కాంట్రాక్ట్‌ విషయమై ఎస్‌ఈపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ‘ఒంట్లో నలతగా ఉంది.. పది నిమిషాలు సమయం ఇవ్వండి.. మీరు అడిగిన విషయాలన్నీ చెబుతాను’ అని ఎస్‌ఈ మొరపెట్టుకున్నా వినిపించుకోకుండా ఆయనపై ఒత్తిడి తెచ్చి గుండెపోటుకు కారకులయ్యారని మండిపడ్డారు.

అధికారం ఎవరిచ్చారు?

ప్రజాస్వామ్యంలో అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారని, రాజకీయ పార్టీలకు కాదని కేకే రాజు అన్నారు. ‘అసలు మేయర్‌, కమిషనర్‌ లేకుండా సమీక్ష సమావేశం నిర్వహించే అధికారం మీకు ఎవరిచ్చారు? విజయవాడ నుంచి వచ్చి విశాఖలో పెత్తనం చెలాయిస్తారా?’అని పట్టాభిని ఉద్దేశించి ప్రశ్నించారు. కేవలం ఒక్క కాంట్రాక్టర్‌ కోసం, ఒక నిజాయితీ గల అధికారిని పొట్టన పెట్టుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. పట్టాభి గతంలో కూడా ఇలానే వేధించినట్లు పలువురు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎస్‌ఈ రాజకీయ హత్యపై తక్షణమే స్వతంత్ర సంస్థచే దర్యాప్తు చేపట్టి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలను డిమాండ్‌ చేశారు. గోవిందరావు కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందన్నారు.

భ్రష్టుపట్టిన వైద్య వ్యవస్థ

చంద్రబాబు పాలనలో వైద్య వ్యవస్థ పూర్తిగా విఫలమైందని కేకే రాజు విమర్శించారు. ఎస్‌ఈ గుండెపోటుకు గురైతే సకాలంలో ప్రభుత్వ అంబులెన్స్‌ రాలేదని, ఆయన కుమార్తె అంబులెన్స్‌ తీసుకువచ్చే వరకు వేచి చూడాల్సి రావడం సిగ్గుచేటన్నారు.

ఆస్పత్రిలో పట్టాభి, పల్లా శ్రీనివాస్‌ నవ్వులాట

ఒకపక్క ఎస్‌ఈ గోవిందరావుకు సీపీఆర్‌ జరుగుతుంటే... ఆస్పత్రికి వచ్చిన పట్టాభి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ అక్కడున్న వారితో నవ్వుతూ పలకరింపులు, పరిచయ కార్యక్రమాల పేరుతో కాలక్షేపం చేశారని మండిపడ్డారు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు అలా వ్యవహరించడం చూస్తుంటే అసలు వారికి మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. తమ కారణంగా ఒత్తిడికి గురై ఒక సీనియర్‌ ఉద్యోగి చనిపోతే టీడీపీ నాయకులు ఆస్పత్రిలో ఇలాగేనా వ్యవహరించేది? అంటూ దుయ్యబట్టారు. ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు.

మంచి అధికారిని కోల్పోయాం

మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ.. జీవీఎంసీ ఒక మంచి అధికారిని కోల్పోయిందన్నారు. తాను మేయర్‌గా ఉన్న సమయంలో గ్రీవెన్స్‌లో గానీ, ఇతర సమయాల్లో గానీ ఎస్‌ఈ గోవిందరావు ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆయన మృత్యువాత పడ్డారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇది అమానుషం

వైఎస్సార్‌సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ.. అధికారులను రాజకీయ ఒత్తిళ్లకు గురిచేయడం తగదని, విశాఖ ప్రశాంత వాతావరణాన్ని టీడీపీ నేతలు పాడుచేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకుంటేనే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.

పార్టీ తూర్పు సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గ, 37వ వార్డు కార్పొరేటర్‌, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెన్నా జానకీరామ్‌, కార్పొరేటర్లు బిపిన్‌కుమార్‌ జైన్‌, రెయ్యి వెంకటరమణ, పీవీ సురేష్‌, మహ్మద్‌ ఇమ్రాన్‌, వురుకూటి రామచంద్రరావు, అక్కరమాని రోహిణి, మువ్వల సురేష్‌, గుడివాడ లతీష్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ షరీఫ్‌, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు రాయపురెడ్డి అనీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement