విశాఖ ఉత్సవ్‌కు సర్వం సిద్ధం
నేటి నుంచి ప్రారంభం
మహారాణిపేట: విశాఖ నగర ఖ్యాతిని చాటేలా ‘విశాఖ ఉత్సవ్–2026’కు యంత్రాంగం సన్నద్ధమైంది. శనివారం నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జేసీ విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి ఆయన ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఉత్సవ వివరాలు వెల్లడించారు.
ఇవీ కార్యక్రమాలు
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.బి.వి.స్వామి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి ప్రత్యేక కార్నివాల్, గాయని సునీత లైవ్ కాన్సెర్ట్ ఉంటుంది. ● కాళీమాత ఆలయం వద్ద ప్రధాన వేదికను సిద్ధం చేశారు. ఇక్కడ రోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ షో, ఫైర్ వర్క్స్ ఉంటాయి. ● గోకుల్ పార్క్ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్థానిక కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ● రుషికొండలో సాహస క్రీడలు, హెలికాప్టర్ రైడ్, పారా మోటరింగ్, భీమిలిలో 25వ తేదీ నుంచి బోట్ రేసింగ్ ఉంటుంది. ● కోస్టల్ స్పోర్ట్స్ (ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ), రంగోలి, వంటల పోటీలు, మిస్టర్, మిస్ వైజాగ్ పోటీలు నిర్వహిస్తారు. ● చిన్నారుల కోసం ఈ నెల 31న స్వర్ణభారతి స్టేడియంలో చిల్డ్రన్ ఒలింపియాడ్ ఉంటుంది. అలాగే బేబీ క్రాలింగ్, రన్నింగ్ రేస్, జంపింగ్ బాల్, స్కేటింగ్ వంటి పోటీలను వయసుల వారీగా నిర్వహిస్తారు. ● ఈ నెల 29–31 వరకు సిటీ సెంట్రల్ పార్కులో ఫ్లవర్ షో ఏర్పాటు చేస్తున్నారు. ● 29న 25 జట్లతో ట్రెజర్ హంట్ పోటీ నిర్వహిస్తున్నారు. ● ఉత్సవాల నిర్వహణకు సుమారు రూ.8 కోట్లు కేటాయించామని, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి, విశ్వప్రియ ఫంక్షన్ హాలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ● పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి గల వారు https:// visakhautsav.com/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ● ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ వేదికలకు ఇన్‌చార్జిలుగా పలువురి అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖ ఉత్సవ్‌కు సర్వం సిద్ధం


