వైఎస్సార్ విగ్రహం కూల్చడం దుర్మార్గపు చర్య
చంద్రబాబు ప్రభుత్వానికి
వైఎస్సార్ అంటే అక్కసు
పెందుర్తిలో తక్షణమే మహానేత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ విగ్రహం కూల్చిన స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి అమర్‌నాఽథ్
పెందుర్తి: రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలపై కూడా చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్ ఆరోపించారు. పెందుర్తిలోని వైఎస్సార్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కూల్చివేసిందని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పేరిట పెందుర్తిలో వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చివేసిన ప్రాంతాన్ని అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు నగర మేయర్ ఇంటి సమీపంలోనే వైఎస్సార్ విగ్రహాన్ని దారుణంగా కూల్చివేశారంటే ప్రభుత్వం పని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రోడ్డు విస్తరణలో విగ్రహాలు తొలగించే అవసరం ఉంటే కచ్చితంగా సంబంధిత పార్టీల నాయకులకు సమాచారం ఇస్తే గౌరవంగా మరోచోటికి మార్చుకుంటారన్నారు. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా విగ్రహాలు కూలదోస్తామంటే సహించబోమని స్పష్టం చేశారు. మరోవైపు పెందుర్తిలో రోడ్డు విస్తరణలో కూడా అవకతవకలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఓ చోట తక్కువ మరో చోట ఎక్కువ భూ సేకరణ చేసి కూటమి నాయకులకు మేలు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారని.. దీన్ని సహించబోమని హెచ్చరించారు. అనంతరం పెందుర్తి జోనల్ కమిషనర్ హెచ్.శంకర్రావును కలిసి రెండు మూడు రోజుల్లో విగ్రహాన్ని పునఃప్రతిష్టించేందుకు ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు శరగడం చినఅప్పలనాయుడు, రాష్ట్ర కార్యదర్శి గండి రవి, పెందుర్తి పరిశీలకుడు డి.దిలీప్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కోడిగుడ్ల దేవిసాంబ, సీనియర్ నేతలు ఉప్పిలి కనకరాజు, మధుపాడ అంజి, గొర్లె రామునాయుడు, గండ్రెడ్డి మహాలక్ష్మినాయుడు, మెంటి మహేష్ పాల్గొన్నారు.


