ఉత్సవ
విశాఖేనా?
● సోకులు బాబువి.. సొమ్ము విశాఖది!
ఈ–గవర్నెన్స్, ఏఐ, యోగాంధ్ర, భాగస్వామ్య సదస్సు, ఎంఎస్‌ఎంఈ సదస్సు.. ఇలా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, స్థానిక ఉత్సవాలతో గడిచిన ఏడాదిన్నర కాలాన్ని పాలకులు ‘ఉత్సవ’నామ సంవత్సరంగా మార్చేశారు. ఈ క్రమంలో నగర ప్రజల సమస్యలను మాత్రం గాలికొదిలేశారు. ఉత్సవాల నిర్వహణకు, నగరం ముస్తాబుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనను మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు ఈ సదస్సులు, ఉత్సవాలకు ఎంత ఖర్చు చేశారు? నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ఏ మేరకు నిధులు విడుదల చేశారు? అని లెక్కలు తీస్తే.. చంద్రబాబు సర్కారు కేవలం ౖపైపె మెరుగులకు, ఉత్సవాల నిర్వహణకే తాపత్రయపడుతోందనే విషయం స్పష్టమవుతోంది.
అభివృద్ధి ఊసేది?
గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి, ఆ దిశగా అడుగులు వేస్తూ కీలక అభివృద్ధి పనులు చేపట్టారు. జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ, వార్డు సచివాలయాలు, హెల్త్ సెంటర్ల నిర్మాణం.. ఇలా ప్రతి అంశంలోనూ నగరాన్ని విస్తృతంగా అభివృద్ధి చేశారు. నగరం మరింత అభివృద్ధి చెందే తరుణంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. 1996 నుంచి చెబుతున్న పాటే పదే పదే పాడుతున్నారు. అదే.. ‘విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం’ అంటూ బాకాలు ఊదడం. ఇది మాటల్లో తప్ప.. ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. 2014–19 మధ్య కాలంలోనూ నగరాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అప్పుడు కూడా కేవలం జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మాత్రమే విశాఖను వాడుకున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఇందులో ఎవరికీ ఆక్షేపణ లేకపోయినా.. సదస్సులు, ఉత్సవాల పేరిట వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, నగర ప్రజల మౌలిక సౌకర్యాలపై కనీస దృష్టి కూడా పెట్టడం లేదు. సదస్సుల నిర్వహణకు జీవీఎంసీ, వీఎంఆర్డీఏలతో కోట్లు ఖర్చు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ తర్వాత నిధులు విడుదల చేయడం లేదు.
గల్లా పెట్టె ఖాళీ.. భూములు లూటీ..
వైజాగ్ నగరమంటే ఇష్టం.. బెస్ట్ సిటీ ఇది.. అంటూ వచ్చిన ప్రతిసారీ బాకాలూదే చంద్రబాబుకు, నగరాభివృద్దిపై మాత్రం ఇష్టం లేదన్నది ఆయన చేతల్లోనే అర్థమవుతోంది. గతంలో వుడా (ప్రస్తుతం వీఎంఆర్డీఏ) ఆస్తుల్ని విక్రయించి, హైదరాబాద్ అభివృద్ధికి వేల కోట్లు తీసుకుపోయిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే పద్ధతిలో విశాఖలో వేల కోట్ల విలువ చేసే భూములను ఊరు పేరు లేని ‘ఉర్సా’లాంటి సంస్థలకు ఎకరం 99 పైసలకే కట్టబెట్టేస్తోంది. తాజాగా ‘విశాఖ ఉత్సవ్’అంటూ రూ.8 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాలంటూ పర్యాటక శాఖతో పాటు వీఎంఆర్డీఏ, జీవీఎంసీ, రెవెన్యూ విభాగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే.. ఈ డబ్బులు కూడా గంగార్పణమేనంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం విశాఖ గల్లా పెట్టెను ఖాళీ చేసేసి, నగరాన్ని ‘ఉత్త’విశాఖగానూ.. సదస్సులు, ఉత్సవాల నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ ‘ఉత్సవ’ విశాఖగానూ మార్చేస్తోందనడంలో అతిశయోక్తి లేదు.
సదస్సులకే వైజాగ్‌ను పరిమితం చేసిన
చంద్రబాబు ప్రభుత్వం
సభలు, సమావేశాలతో
వీఎంఆర్డీఏ, జీవీఎంసీ ఖజానాలు ఖాళీ
అభివృద్ధికి పైసా విదల్చకుండా కాలక్షేపం
ఇక్కడ భూములను మాత్రం
కారుచౌకగా కట్టబెట్టేస్తున్న సర్కారు
జిల్లా ఖజానాకి రూ.కోట్లు
బకాయిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం
తాజాగా ‘విశాఖ ఉత్సవ్’ పేరుతో
రూ.8 కోట్లకు కన్నం
సాధారణంగా ఆలయాల్లో మూలవిరాట్‌ను కదల్చకుండా.. పండగలు, పర్వదినాల
సమయంలో కేవలం ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగిస్తుంటారు. ఆ విగ్రహాలను
కేవలం ఉత్సవాలకు మాత్రమే పరిమితం చేస్తారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే..
మహా విశాఖ కూడా కేవలం ఒక ఉత్సవ నగరంగానే మిగిలిపోతోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా విలసిల్లుతున్న విశాఖను చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఉత్సవాలకు వేదికగా మార్చేసింది. – సాక్షి, విశాఖపట్నం
‘మహా’సంస్థలపై మోయలేని భారం
నగర ప్రజలు చెల్లిస్తున్న ఆస్తి పన్ను, నీటి పన్ను, వ్యాపారులు చెల్లించే వర్తక పన్ను, లీజుల ద్వారా వచ్చే ఆదాయంతో పరిపాలన సాగించే జీవీఎంసీపై ప్రభుత్వం అదనపు భారాన్ని మోపుతోంది. దేశీయ, అంతర్జాతీయ సదస్సులతో పాటు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనల ఖర్చును రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏలే భరిస్తున్నాయి. యోగాంధ్ర కోసం సుమారు రూ.100 కోట్లు వెచ్చించగా, ఈ మొత్తాన్ని రెవెన్యూ విభాగమే ఖర్చు చేసింది. దాదాపు ఏడు నెలలు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లాయి. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులతో పాటు, కేంద్రం నిధులు కూడా స్వాహా చేసేసింది. ఇప్పటివరకు పలుమార్లు అధికారులు విన్నవించుకున్నా.. ఇంకా రూ.40కోట్ల వరకు బకాయిలున్నాయి. ఇదే యోగాంధ్రకు జీవీఎంసీ సుమారు రూ.10 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.12 కోట్ల వరకూ ఖర్చు చేశాయి. ఆ నిధుల ఊసే ఎత్తడం లేదు.
అదే మాదిరిగా సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రెవెన్యూ విభాగం ప్రోటోకాల్ కోసం రూ.7 కోట్లు, నిర్వహణ, సుందరీకరణ కోసం జీవీఎంసీ రూ.60 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.10 కోట్ల వరకు ఖర్చు చేశాయి. ఈ నిధుల్లో ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించలేదు. ఇలా రెండు ప్రధాన సదస్సుల కోసమే ప్రభుత్వం సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయించింది. మిగిలిన ఎంఎస్‌ఎంఈ సదస్సు, క్లీన్ ఎనర్జీ ఎక్స్‌పో, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి సదస్సు, విశాఖ రీజియన్ అభివృద్ధి సదస్సు.. ఇలా ఎన్నో సదస్సులకు మరో రూ.100 కోట్ల వరకు మంచినీళ్లలా ఖర్చు చేశారు. కానీ..నగర అభివృద్ధికి నిధులివ్వండి మహాప్రభో అంటే.. పట్టుమని రూ.10 కోట్లు కూడా ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.


