స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు ఆదర్శనీయం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలనా విధానాలు ఆదర్శనీయంగా ఉన్నాయని న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) అధ్యయన బృందం ప్రశంసించింది. 51వ అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో భాగంగా ఐఐపీఏ డైరెక్టర్ జనరల్ సురేంద్రనాథ్ త్రిపాటి, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ సచిన్ చౌదరీ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం మంగళవారం విశాఖ నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్‌తో బృందం సభ్యులు సమావేశమయ్యారు. నగర సుందరీకరణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పారిశుధ్య నిర్వహణ, మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అఖిల భారత సర్వీసులు, రక్షణ దళాలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఈ బృందం.. పట్టణ పాలన, ప్రజలకు అందుతున్న సేవలు, పథకాల ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఈ పర్యటన చేపట్టింది. సమావేశానంతరం అధ్యయన బృందం నగరంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. కాపులుప్పాడలోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ముడసర్లోవలోని ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, నరవలోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లను సభ్యులు సందర్శించారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ తీరు అద్భుతంగా ఉందని బృందం సభ్యులు కొనియాడారు. ఈ నెల 23 వరకు విశాఖలో పర్యటించనున్న ఈ బృందం.. వీఎంఆర్డీఏ, విశాఖపట్నం పోర్టు అథారిటీ తదితర సంస్థలను కూడా సందర్శించి అక్కడి అధికారులతో చర్చించనున్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సత్యవేణి, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఐఐపీఏ డైరెక్టర్ జనరల్


