అలంకారం
సకల కళా పోషకులు, కళాకారులకు నిలయం
జానపదం, పౌరాణికం, ఆధ్యాత్మికం
ప్రదర్శనలో ప్రతిభావంతులు
నాటకమే ఊపిరిగా..జానపదాలే
శ్వాసగా సాగిపోతున్న కళాకారులు
ప్రోత్సాహం కరువైనా..రంగస్థలాన్ని వీడని వైనం
కళారంగానికి అగనంపూడి
అగనంపూడి : కళల కాణాచిగా, కళాకారుల పుట్టినిల్లుగా అగనంపూడి, పరిసర నిర్వాసిత కాలనీలు విరాజిల్లుతున్నాయి. పౌరాణిక నాటకాల నుంచి ఆధునిక సాంఘిక నాటకాల వరకు, జానపద కళలైన తప్పెటగుళ్లు, కోలాటం నుంచి ఆధ్యాత్మిక భజనల వరకు ఈ ప్రాంత కళాకారులు తమ నటనా చాతుర్యంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్నారు. నేటి ఆధునిక కాలంలో సెల్‌ఫోన్ మాయా ప్రపంచంలో పడి ప్రాచీన కళలు అంతరించిపోతున్న తరుణంలో కూడా, ఇక్కడి వెయ్యి మందికి పైగా కళాకారులు పట్టువదలని విక్రమార్కుల్లా భారతీయ సంస్కృతిని కాపాడుతూ వస్తున్నారు. ఉచిత ప్రదర్శనలిస్తూ, కళనే శ్వాసగా బతుకుతున్న వీరి ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం.
పౌరాణిక నాటక రంగంలో కోటా సుబ్బారావు, కొయ్య చిన సత్యనారాయణ రెడ్డి, కట్టా పైడిరాజు వంటి మహామహులు ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా పెద్దిశెట్టి రామారావు తన అద్భుత నటనా కౌశలానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును అందుకుని అగనంపూడి కీర్తిని దశదిశలా చాటారు. అలాగే నక్కా రమణబాబు, మామిడి నరసింగరావు, గుదే గజేంద్రరావు వంటి వారు వందలాది సాంఘిక నాటకాల్లో జీవించి, కళా మండళ్ల ద్వారా నాటక రంగానికి ప్రాణం పోశారు. నక్కా రమణబాబు నటునిగా, దర్శకునిగా గొల్లపూడి మారుతీరావు చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకోవడం విశేషం. కేవలం నాటకాలకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక రంగంలోనూ ఈ ప్రాంతం మేటిగా నిలుస్తోంది. ఎస్.ఎల్.పి. రావు సారథ్యంలో ఏర్పడిన వెంకటేశ్వర భజన మండలి ద్వారా వందలాది మంది కోలాట, భజన కళాకారులు తయారయ్యారు. తిరుమల నుంచి వారణాసి వరకు అనేక పుణ్యక్షేత్రాల్లో వీరు తమ ప్రదర్శనలతో భక్తులను ముగ్ధులను చేశారు.
జానపదంలో విందుల, జాజుల
జానపద కళల విషయానికి వస్తే.. విందుల నరసింహనాయుడు, జాజుల అప్పారావు వంటి వారు కోలాటాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. నరసింహనాయుడు ఏకంగా 20 బృందాలను తీర్చిదిద్ది, 2,500కు పైగా ప్రదర్శనలు ఇచ్చి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని సాధించారు. జాజుల అప్పారావు తన సాహితీ, నటనా ప్రతిభతో ‘తెలుగు రత్న’, ‘సకల కళా కోవిదుడు’ వంటి బిరుదులను కై వసం చేసుకున్నారు. పినమడక, చెట్టివానిపాలెం వంటి గ్రామాల్లో తప్పెటగుళ్ల కళాకారులు అమ్మవారి జాతరల్లో మువ్వల సవ్వడితో జానపదానికి గజ్జెలు కడుతున్నారు. ప్రభుత్వ ఆదరణ కరువైనా, నిరాదరణ ఎదురైనా తరతరాలుగా వస్తున్న ఈ కళా వారసత్వాన్ని గుండెలకు హత్తుకుని ముందుకు సాగుతున్న అగనంపూడి కళాకారుల కృషి అనన్యం.
శిథిల భవనమే వీరికి స్థావరం
జాతీయ రహదారి అగనంపూడిలో శిథిల భవనమే వీరికి వేదిక. వీరు పౌరాణిక నాటకాలను దినచర్యగా మార్చుకొని సాధన చేస్తున్నారు. నటుడు కట్టా పైడిరాజు సారధ్యంలో మూడు దశాబ్దాల క్రితం నటరాజ రంగస్థల కళానిలయం పేరుతో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రతీ ఆదివారం వారి గాత్రానికి, నటనకు పదును పెడుతున్నారు.
అలంకారం
అలంకారం
అలంకారం


