నిర్వాసితులకు పరిహారం చెక్కుల అందజేత
విశాఖ సిటీ: అడవివరం జంక్షన్ నుంచి మామిడిలోవ జంక్షన్ (శొంఠ్యాం) వరకు చేపట్టిన రహదారి విస్తరణ ప్రాజెక్టులో ఇళ్లు, షాపులు కోల్పోయిన యజమానులకు వీఎంఆర్‌డీఏ అధికారులు నష్ట పరిహార చెక్కులు అందజేశారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, కనెక్టివిటీ మెరుగుపర్చడం కోసం 100 అడుగుల వెడల్పుతో సుమారు 8 కిలోమీటర్ల మేర వీఎంఆర్‌డీఏ ఈ రహదారిని అభివృద్ధి చేస్తోంది. ఇందులో పలు నిర్మాణాలు, కట్టడాలు దెబ్బతిననున్నాయి. మంగళవారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆస్తులు కోల్పోయిన వారికి వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్పా చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. అలాగే నేరేళ్లవలస–కొత్తవలస.. భీమిలి రహదారి విస్తరణలో నష్టపోయిన వారికి కూడా పరిహారం అందజేశారు. ఈ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయే వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ అంగీకార పత్రాలు సత్వరమే అందించి, రహదారి అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించాలని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ అధికారులు కిశోర్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.


