టీడీపీ దిగజారుడు రాజకీయం
పార్టీ నుంచి గండి బాబ్జీ అనుచరుడు గనిశెట్టి కనకరాజును సస్పెండ్ చేసిన అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు
దాన్ని కప్పి పుచ్చుకునేందుకు
అతడిని కాదు మరో కనకరాజు అంటూ దుష్ప్రచారం
వైఎస్సార్‌సీపీ పెందుర్తి కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి కనకరాజు ఫొటోతో సోషల్ మీడియాలో పోస్టులు
పెందుర్తి టీడీపీ దుస్థితిని చూసి
నవ్వుకుంటున్న జనం
పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు దిగింది. ఓ మండలస్థాయి నాయకుడి సస్పెన్సన్‌ను కూడా హుందాగా స్వీకరించకుండా తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియా వేదికగా అబాసుపాలైంది. ఓ రకంగా టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీకి సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెందుర్తి మండలం చింతగట్లకు చెందిన గండి బాబ్జీ అనుచరుడు గనిశెట్టి కనకరాజును ఆ పార్టీ అదిష్టానం ఆదేశాల మేరకు టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీడీపీ మండల కార్యదర్శిగా ఉన్న కనకరాజు గండి బాబ్జీకి అత్యంత సన్నిహితుడు. అయితే గండి బాబ్జీ నాయకత్వాన్ని సహించలేని టీడీపీ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వర్గీయులు ఇటీవల అతడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతని అనుచరుడు కనకరాజును టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. అయితే కనకరాజు సస్పెన్షన్‌ను జీర్ణించుకోలేని గండి బాబ్జీ వర్గీయులు సస్పెండ్ అయింది చింతగట్లకు చెందిన వైఎస్సార్‌సీపీ మండల కమిటీ సభ్యుడు గనిశెట్టి కనకరాజు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. వైఎస్సార్‌సీపీలో ఉన్న నాయకుడ్ని టీడీపీ అదిష్టానం ఎలా సస్పెండ్ చేస్తుందో అర్థంగాక సోషల్ మీడియా జనాలు జుట్టుపీక్కుంటున్నారు. పెందుర్తి టీడీపీకి పిచ్చి పరాకాష్టకు చేరిందని నవ్వుకుంటున్నారు.
అసలు విషయం ఇదీ..
చింతగట్ల పంచాయతీలో కీలక నాయకుడిగా ఉన్న గనిశెట్టి కనకరాజు(సర్పంచ్ వెంకటలక్ష్మి భర్త) కొన్నాళ్ల క్రితం గండి బాబ్జీ సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే తొలి నుంచీ గండి బాబ్జీ మీద కోపంగా ఉన్న బండారు వర్గీయులు కనకరాజు రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే టీడీపీ పాతకాపులను పట్టించుకోకుండా గండి బాబ్జీ ఇటీవల ప్రకటించిన మండల, వార్డు కమిటీల్లో పూర్తిగా తన అనుచరులకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో మరింత చిర్రెత్తుకొచ్చిన బండారు వర్గీయులు బాబ్జీ తీరును ఎండగడుతూ పార్టీ అదిష్టానానికి ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బాబ్జీకి ప్రధాన అనుచరుల్లో ఒక్కరైన గనిశెట్టి కనకరాజుతో పాటు అదే గ్రామానికి చెందిన దమ్ము రమేష్ అనే చోటా కార్యకర్తను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు సస్పెండ్ చేశారు. అయితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటు సోషల్ మీడియాలో.. అటు టీడీపీ గ్రూపుల్లో అదే పేరుతో వైఎస్సార్ సీపీలో మండల కమిటీ సభ్యుడిగా ఉన్న గనిశెట్టి కనకరాజును టీడీపీ సస్పెండ్ చేసినట్లు దిగజారుడు రాజకీయాలకు దిగారు.
తాతయ్యబాబుపై
గండి బాబ్జీ ఫైర్..!
మరోవైపు ఈ సస్పెన్షన్ వ్యవహారం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ.. అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మధ్య చిచ్చుపెట్టింది. తన అనుచరుడు గనిశెట్టి కనకరాజును సస్పెండ్ చేయడం పట్ల తాతయ్యబాబుపై బాబ్జీ ఫైర్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కనకరాజు సస్పెన్షన్‌ను రద్దు చేసుకునేందుకు బాబ్జీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలోని దుస్థితిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
టీడీపీ దిగజారుడు రాజకీయం


