సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట/మధురవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం ఉదయం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించగా, సాయంత్రం సీపీ శంఖబ్రత బాగ్చితో కలిసి మధురవాడ ఐటీ హిల్స్‌లో క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం శుక్రవారం ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ఐటీ హిల్ నం.3 హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హరిత రిసార్ట్స్ పక్కన ఉన్న స్థలానికి చేరుకుని, ఉదయం 10.30 గంటలకు కాగ్నిజెంట్ క్యాంపస్‌కు భూమిపూజ చేస్తారు. అనంతరం ఐటీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుంచి రుషికొండలోని ఏ–1 గ్రాండ్ కన్వెన్షన్ హాలుకు వెళ్లి వైజాగ్ ఎకనామిక్ రీజియన్(వీఈఆర్) సమావేశంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్, సభాప్రాంగణం పరిసరాల్లో బారికేడ్లు, పార్కింగ్ వసతి కల్పించాలని, రోడ్లకు మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా పరంగా ఎక్కడా లోపం లేకుండా చూడాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో జేసీ మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీసీపీ మణికంఠ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.


