చదువులో టాపర్.. స్కేటింగ్‌లో సూపర్
5 అంతర్జాతీయ పతకాలు సొంతం
విశాఖ స్పోర్ట్స్: జాతీయ స్థాయిలో రాణిస్తే మనకే గర్వకారణం.. అదే అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధిస్తే అది దేశానికే గర్వకారణం.. ఇదే మాటను తన ఆశయంగా మార్చుకుంది విశాఖకు చెందిన ఆర్టిస్టిక్ స్కేటర్ శ్రీసాహితి. సరదాగా మొదలైన ప్రయాణాన్ని సీరియస్ కెరీర్‌గా మలచుకుని, పతకాల పంట పండిస్తోంది. ఒకే ఏడాది జాతీయ స్థాయిలో ఏడు పతకాలను కొల్లగొట్టిన సాహితి.. అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది.
నాలుగున్నరేళ్లకే స్కేట్స్ కట్టి..
2016లో తన అన్నయ్య శ్రీసాకేత్‌తో కలిసి వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లిన శ్రీసాహితికి అక్కడ స్కేటింగ్ పై ఆసక్తి కలిగింది. అప్పుడు ఆమె వయసు కేవలం నాలుగున్నరేళ్లు. కోచ్‌లు చెప్పే మెలకువలను ఇట్టే గ్రహించే ఆమె ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోయారు. శిక్షణ తీసుకున్న రెండు నెలల్లోనే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాన్ని సాధించింది. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు.
పతకాల ప్రవాహం : జిల్లా స్థాయి నుంచి మొదలుకొని జాతీయ స్థాయి వరకు శ్రీసాహితి ఇప్పటివరకు మొత్తం 106 పతకాలను సాధించడం విశేషం. కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ రింక్‌లలోనూ తన సత్తా చాటి ఐదు పతకాలను కై వసం చేసుకుంది. తైవాన్‌లో జరిగిన ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో సోలో డాన్స్ విభాగంలో తన తొలి అంతర్జాతీయ స్వర్ణాన్ని గెలుచుకుంది. ఆసియానియా పసిఫిక్ కప్ ఇన్‌లైన్ పోటీల్లోనూ స్వర్ణం సాధించి ఔరా అనిపించింది. నగరంలో జరుగుతున్న జాతీయ రోలర్ స్కేటింగ్ పోటీల్లో 12–15 బాలికల విభాగం ఫ్రీ స్కేటింగ్ విభాగంలో సాహితి స్వర్ణ పతకం సాధించింది.
చదువులోనూ చురుకుదనం : ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న శ్రీసాహితి.. క్రీడల్లోనే కాదు చదువులోనూ టాపరే. తనకు ఎంతో ఇష్టమైన ఫిగర్ స్కేటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ఆమె, టెక్నికల్ అంశాల్లోనూ పట్టు సాధించింది. ‘జాతీయ స్థాయిలో ఒకేసారి ఏడు పతకాలు వచ్చినప్పుడే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలననే నమ్మకం వచ్చింది. దేశం తరఫున ఆడి గెలిస్తే వచ్చే గౌరవమే వేరు’ అని శ్రీసాహితి ‘సాక్షి’తో పేర్కొంది. ప్రస్తుతం సాహితి మరోసారి ఆసియన్ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది.


