న్యాయం చేయకుండా డిశ్చార్జ్ చేస్తారా?
కేజీహెచ్ ప్రసూతి వార్డు ఎదుట బాలింత ఆందోళన
మహారాణిపేట: కేజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ శిశువు మృతి చెందిందని, ఈ ఘటనపై విచారణ పూర్తి కాకుండానే తమను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయడం తగదని బాలింత పి.ఉమాదేవి, ఆమె భర్త సూర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం కేజీహెచ్ ప్రసూతి వార్డు ఎదుట బాధితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తమకు న్యాయం చేయకపోగా, ఇప్పుడు అర్ధాంతరంగా ఇంటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. వైద్యుల వైఖరిపై ఇప్పటికే కలెక్టర్‌కు, ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ‘ప్రసూతి వైద్యులు సక్రమంగా పర్యవేక్షించి ఉంటే మా మగబిడ్డ దక్కేవాడు. వారి నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడు. ఆ ఇద్దరు వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’ అని బాలింత ఉమాదేవి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా తమను డిశ్చార్జ్ చేసి పంపడం అన్యాయమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి స్పందిస్తూ.. ఈ ఘటనపై కేజీహెచ్‌కు సంబంధం లేని వైద్యుల చేత విచారణ జరిపించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు.
ముగ్గురు వైద్యులతో విచారణ
ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కమిటీని నియమించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ అధికారి డాక్టర్ రాధారాణి, అగనంపూడి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీప్రసన్న విచారణ చేసి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తారు.


