విహారంలో విషాదం
హుకుంపేట: విహార యాత్రకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతితో విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్‌ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజినీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19)కి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతుడు రుద్రసాయిది విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస. అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అతని తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదించారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


