రిటైర్డ్ సీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
సర్వీస్‌లో 4 సార్లు ఏసీబీకి చిక్కిన ఇంజినీర్ రూ.కోటి విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం విశాలాక్షినగర్‌లో అదుపులోకి తీసుకున్న అధికారులు
ఆరిలోవ: ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్‌లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన సబ్బవరపు శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నగరంలోని విశాలాక్షినగర్‌లో ఉన్న ఆయన ఇంటితో పాటు నగరంలోని మరో నాలుగు చోట్ల, హైదరాబాద్, ఏలూరు, విజయనగరం ప్రాంతాల్లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. విశాలాక్షినగర్‌లోని నివాసంలో శ్రీనివాస్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ విజయవాడలో ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్‌లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి బిల్లుల మంజూరు కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఆగస్టు 7న ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ కేసులో రిమాండ్‌లో ఉండగానే ఆయన పదవీ విరమణ పొందారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే తాజా సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపారు. సోదాల్లో విశాలాక్షినగర్‌లోని ప్లాట్‌తో పాటు సుమారు రూ.కోటి విలువ చేసే స్థిరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటిని కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ వివరించారు. శ్రీనివాస్ తన సర్వీస్‌లో నాలుగు సార్లు ఏసీబీకి చిక్కినట్లు వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారు ఉద్యోగ విరమణ పొందినా చట్టం నుంచి తప్పించుకోలేరని డీఎస్పీ స్పష్టం చేశారు.


