అద్భుతం.. విశాఖ బాలోత్సవం
డాబాగార్డెన్స్: విశాఖ బాలోత్సవంలో రెండో రోజైన బుధవారం విద్యార్థుల సృజనాత్మకత ఆకాశాన్ని తాకింది. సెయింట్ ఆంథోని తెలుగు మీడియం స్కూల్ వేదికగా వార్తా రచన, కథా రచన, కవితా రచన, కథా విశ్లేషణ, డిబేట్(టీమ్), వక్తృత్వం(తెలుగు–ఇంగ్లిష్), అంతర్జాలంలో అన్వేషణ, మెమరీ టెస్ట్, కథ చెపుతాను, జానపద నృత్యం(సోలో), దేశభక్తి గీతాలాపన (బృందం–సోలో), లఘు నాటికలు, క్లాసికల్ డ్యాన్స్(సోలో), ఏకపాత్రాభినయం, జానపద గీతాలాపన(బృందం), వాయిద్య గానం(ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్), జానపద నృత్యం(బృందం), స్టాండప్ కామెడీ వంటి విభిన్న పోటీలు నిర్వహించారు. ఇంటర్నెట్ అన్వేషణలో ట్రంప్ భారత్‌పై విధించిన టారిఫ్‌లు అనే అంశం, వార్తా రచన కేటగిరీలో విశాఖపట్నంలో పెరుగుతున్న మత్తు, గంజాయిపై చర్యలు, ప్రతి వార్డ్‌కు ఒక క్రీడా మైదానం ఏర్పాటు వంటి సామాజిక సమస్యలపై చర్చించారు. వివిధ అంశాల్లో ఉపన్యాసాలతో విద్యార్థులు తమలో దాగివున్న ప్రతిభను, సామాజిక అవగాహనను చాటిచెప్పారు. నగరంలోని ప్రముఖ కవులు, కళాకారులు, విద్యావేత్తలు 100 మంది న్యాయ నిర్ణేతలుగా, మరో 100 మంది వలంటీర్లుగా సహకరించారు.
అద్భుతం.. విశాఖ బాలోత్సవం
అద్భుతం.. విశాఖ బాలోత్సవం


