బాల్యవివాహాలు అరికట్టడానికి 100 రోజుల ప్రణాళిక
అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్
మహారాణిపేట: బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ మీటింగ్ హాల్‌లో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని, దీని ప్రకారం నవంబర్ 27 నుంచి మార్చి 8 వరకు మూడు విడతలుగా ఈ అవగాహన ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ప్రతిజ్ఞ చేసి క్యాంపెయిన్ నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులతో ర్యాలీలు, డిబేట్లు, పోటీలు నిర్వహించాలని, స్కూల్ అసెంబ్లీలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సందేశాలు ఇవ్వాలని సూచించారు. పోలీస్ అధికారులు బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అనుమానం ఉన్న పెళ్లిళ్ల వద్ద పరిశీలించి, అవసరమైతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు. మైనర్లకు పెళ్లిళ్లు జరగకుండా మత పెద్దలు సహకరించాలన్నారు. చైల్డ్‌లైన్ అధికారులు, ఎన్జీవోలు బాల్య వివాహాలు జరుగుతుంటే వాటిని నిలుపుదల చేసి వారికి ఆశ్రయం కల్పించాలని, ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇన్‌చార్జ్ డీఆర్వో సత్తిబాబు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి రామలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


