గంగవరం పోర్టు ముట్టడి
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టులో పనిచేసిన నిర్వాసిత కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సోమవారం ఉదయం పోర్టు మెయిన్ గేట్‌ను ముట్టడించారు. పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో పోర్టు యాజమాన్యం నిర్వాసిత కార్మికులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఒక్కో కార్మికునికి రూ. 27 లక్షలు చెల్లిస్తామని, అలాగే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చింది. అయితే 20 రోజుల తరువాత 500 మంది కార్మికులకు రూ. 24 లక్షల 80 వేలు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ. 2 లక్షల 20 వేల రూపాయలను ట్యాక్స్ పేరుతో చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో పాటు, కార్మికులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఒక్కసారిగా పోర్టు గేటు వద్దకు పోటెత్తి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యాజమాన్యం న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు గేటు వద్దకు చేరుకుని కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. తమకు మిగిలిన డబ్బులు వెంటనే చెల్లించాలని, అక్రమంగా పెట్టిన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాలని, పీఎఫ్ డబ్బులు వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనతో రంగంలోకి దిగిన డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్.. పోర్టు యాజమాన్యం ప్రతినిధులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లోగా ఈ సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ ఆందోళనను విరమించారు.
బకాయిల కోసం కార్మికుల నిరసన


