ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించండి
మహారాణిపేట: ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు 2,09,652 మంది చిన్నారులు ఉన్నారని, వారిలో అర్బన్‌లో 1,93,090 మంది గ్రామీణ ప్రాంతాల్లో 16,562 మంది ఉన్నారని తెలిపారు. 1062 పల్స్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 50 ట్రాన్సిట్ బూత్‌లను, 85 మొబైల్ బూత్‌లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 22, 23వ తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని, దీనికోసం 2004 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 85 హైరిస్క్ ప్రాంతాలలో 6,497 మంది చిన్నారులు ఉన్నారని, అలాంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలియో చుక్కలు వేయాలన్నారు. పల్స్ పోలియోపై సినిమా థియేటర్లు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌లో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇన్‌చార్జ్ డీఆర్‌వో సత్తిబాబు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, డీఎంహెచ్‌వో డాక్టర్ జగదీశ్వరరావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకర ప్రసాద్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు, అధికారులు పాల్గొన్నారు.


