పనిచేస్తారు? | - | Sakshi
Sakshi News home page

పనిచేస్తారు?

Dec 9 2025 6:59 AM | Updated on Dec 9 2025 6:59 AM

పనిచేస్తారు?

పనిచేస్తారు?

దక్షిణ కోస్తా జోన్‌లోనా..? రాయగడ డివిజన్‌లోనా..?

రైల్వే ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చిన

రైల్వే బోర్డు

జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసేందుకు ప్రథమ ప్రాధాన్యం

నాలుగు వారాల గడువు విధింపు

1,100 నాన్‌గెజిటెడ్‌ పోస్టుల సర్దుబాటు

గెజిట్‌ రాకపోవడంతో

జోన్‌ కార్యకలాపాలకు అడ్డంకి

మీరెక్కడ

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నమూనా

సాక్షి, విశాఖపట్నం : దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం గెజిట్‌ ఇవ్వకుండానే సర్దుబాట్లు, దిద్దుబాట్లతో నడిపిస్తోంది. కొత్త జోన్‌ పరిధిలోని డివిజన్లు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్‌లో ఎక్కడ పనిచేయాలని కోరుకుంటున్నారో తెలపాలని ఉద్యోగులకు ఈనెల 2వ తేదీన ఆప్షన్లు ఇస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జోన్‌ డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక) ఆమోదం సమయంలో చెప్పిన విధంగానే, ప్రస్తుతం ఉన్న నాన్‌–గెజిటెడ్‌ పోస్టులను సర్దుబాటు చేస్తూ బోర్డు ఈనెల 4న మరో సర్క్యులర్‌ విడుదల చేసింది. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన సవరించిన డీపీఆర్‌ను రైల్వేబోర్డు ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. అయితే రైల్వే బోర్డు కొత్త పోస్టుల నియామకాలు, నిధుల విషయంలో ఆంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రకటనలు, వరుస ఉత్తర్వులు జారీ చేస్తోంది. గెజిట్‌ విడుదల కాకపోవడంతో తాత్కాలిక కార్యకలాపాల ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీఎంఆర్‌డీఏ డెక్‌లో తాత్కాలిక జీఎం కార్యాలయం పనులు పూర్తయినా.. గెజిట్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

ఉద్యోగులూ.. ఆప్షన్లు ఎంచుకోండి

కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్‌తో పాటు రాయగడ డివిజన్‌లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఇష్టం ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలంటూ రైల్వే బోర్డు మ్యాన్‌పవర్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ మెహ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేజోన్‌లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖ డివిజన్‌గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్‌లో చేర్చుతూ డీపీఆర్‌ తయారు చేశారు. కొత్త జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్‌లో పనిచేసేందుకు పోస్టింగ్‌లపై ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. జోన్‌ హెడ్‌క్వార్టర్‌ కోసం దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే హెడ్‌క్వార్టర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యమిస్తుండగా.. రెండో ప్రాధాన్యం కింద మిగిలిన డివిజన్లకు సంబంధించిన వారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాయగడ డివిజన్‌ ఆప్షన్లు ఎంచుకునేందుకు వాల్తేరు డివిజన్‌ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. రెండో ప్రాధాన్యత కింద ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌, తర్వాత ఇతర జోన్లు ఉద్యోగులు ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించారు. హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి 4 వారాల సమయం ఇస్తున్నట్లు రైల్వే బోర్డు మ్యాన్‌పవర్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ మెహ్రా ఆదేశించారు.

నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల విభజన షురూ

విశాఖ జోన్‌, రాయగడ డివిజన్‌ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్‌కోస్ట్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల విభజనను కేడర్‌ ప్రకారం కేటాయింపులు చేస్తూ ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ కోస్తా జోన్‌ హెడ్‌క్వార్టర్స్‌ కోసం 1,100 నాన్‌గెజిటెడ్‌ పోస్టుల బదిలీ జరగాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. దానికనుగుణంగా కేడర్ల వారీగా బదిలీలకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి 959, వాల్తేరు డివిజన్‌ నుంచి 129 పోస్టులు, ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ నుంచి 12 పోస్టులు బదిలీ చేయాలని నిర్ణయించారు. అకౌంట్స్‌ విభాగంలో 298, ఇంజినీరింగ్‌ 104, కమర్షియల్‌ విభాగం నుంచి 101 పోస్టులు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా రాయగడ డివిజన్‌ కోసం డీపీఆర్‌లో 600 నాన్‌ గెజిటెడ్‌ పోస్టులు కేటాయించారు. ఈ డివిజన్‌ కోసం వాల్తేరు డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి 381 పోస్టులు, ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి 219 పోస్టులు కేటాయించారు. పర్సనల్‌ విభాగంలో 110, ఆపరేటింగ్‌ నుంచి 72, ఎలక్ట్రికల్‌ విభాగం 66 పోస్టులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల నిర్వహణ బోర్డు ఆమోదించిన ప్రామాణిక హోదాల్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement