డిజిటల్ రైతు బజార్
ఎంవీపీకాలనీ: రైతులు పండించే గ్రామీణ ఉత్పత్తులు వినియోగదారులకు మరింత చేరువకానున్నాయి. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ.. మార్కెటింగ్ పద్ధతుల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రైతు బజార్ల వ్యవస్థ ద్వారా రైతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తుండగా.. తాజాగా ‘ఆన్‌లైన్ డెలివరీ’విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం కానుంది. దీని కోసం ఇప్పటికే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించగా, త్వరలో మొబైల్ యాప్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ఎంవీపీకాలనీ రైతుబజార్‌లో ఈ ఆన్‌లైన్ విక్రయాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవలకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా..
ఆన్‌లైన్ కూరగాయల విక్రయాల కోసం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ https://www.digi rythubazaarap.com వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. మెషెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ సేవలను అందిస్తున్నారు. ఎంవీపీకాలనీ రైతుబజార్ వేదికగా ఈ పైలట్ ప్రాజెక్టు మొదలైంది. ఈ సేవలను పొందాలనుకునే వినియోగదారులు తొలుత పైన పేర్కొన్న వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. అనంతరం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఉత్పత్తులు, వాటి ధరలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. కావాల్సిన వాటిని ఎంపిక చేసుకుని ఆర్డర్ చేయాలి. ఈ ఆర్డర్లను ఎంవీపీ రైతుబజార్‌లో మెషెంట్ సొల్యూషన్స్ టెక్నికల్ టీమ్ స్వీకరిస్తుంది. ఆర్డర్‌కు అనుగుణంగా అక్కడి రైతుల నుంచి కూరగాయలను సేకరించి, ప్రత్యేకంగా ప్యాకింగ్ చేస్తారు. అనంతరం ‘మైబాక్స్’ డెలివరీ పార్ట్నర్ ద్వారా వినియోగదారుడికి చేరవేస్తారు. వినియోగదారులు క్యాష్ ఆన్ డెలివరీ లేదా యూపీఐ పద్ధతిలో డబ్బులు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఎంవీపీ రైతుబజార్ పరిధిలోని 5 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ‘డిజి రైతుబజార్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. మరో రెండు వారాల్లో ఈ యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.
డిజిటల్ రైతు బజార్


