సేవలకు ఆకాశమే హద్దు
ఏయూక్యాంపస్: సచివాలయ మహిళా పోలీసులకు విధులు కేటాయించేందుకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి సమావేశం నిర్వహించారు. మంగళవారం ఆర్మ్‌డ్ రిజర్వ్ మైదానంలో దాదాపు 430 మంది మహిళా పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా ఎంట్రీ నైపుణ్యం ఉన్నందున వారికి 10 రకాల నిర్దిష్ట విధులను కేటాయించారు. ఇ–కాప్స్ ఆపరేటర్లకు, దర్యాప్తు అధికారులకు సహాయపడటం, సైబర్ నేరాలు, డ్రగ్స్, మహిళా భద్రతపై అవగాహన కల్పించడం, రిసెప్షన్ బాధ్యతలు, రికార్డుల అప్‌డేట్, కౌన్సెలింగ్, ఫీల్డ్‌లో సమాచార సేకరణ, సమన్ల జారీ, లోక్ అదాలత్ పనులు, పిటిషన్లపై బాధితులకు సమాచారం ఇవ్వడం వంటి బాధ్యతలను వారికి అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మహిళా పోలీసుల విధి నిర్వహణకు ఆకాశమే హద్దని, శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు. అనంతరం సిబ్బంది తమ సమస్యలను వివరించగా, పరిష్కరిస్తామని సీపీ హామీ ఇచ్చారు.


